Indian Railways : ఏసీ కోచ్‌లో ఎలుకలు.. అసలు ఏమి జరిగిందంటే

Indian Railways : ట్రైన్‌లో అందించే ఆహారం నాసిరకంగా ఉందని, టాయిలెట్లు అశుభ్రంగా ఉన్నాయని, రైళ్లు ఆలస్యంగా వచ్చిందని ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తుండటం మనం చూస్తూ ఉంటాం. కానీ, ఇటీవల రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. సౌత్ బిహార్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. ఏసీ కోచ్‌లో ఉన్న ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి తన బెర్త్ వద్ద ఎలుకలు తిరగటాన్ని గమనించాడు. అనంతరం రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో రైళ్లలో పరిశుభ్రత అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
రూ.2వేలు చెల్లించి రైలులో సెకండ్ ఏసీలో టికెట్ బుక్ చేసుకున్నాడు. అతడు సీటు వద్ద ఎలుకలను చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల వేదికగా అధికారులకు ఫిర్యాదు చేశాడు. పీఎన్‌ఆర్ నంబర్ 6649339230. రైలు నంబర్ 13288. ఏ 1 కోచ్‌లో కొన్ని ఎలుకలు సీట్లు, లగేజీలపై తిరుగుతున్నాయి. రూ.2 వేలు చెల్లించి సెకండ్ ఏసీలో టికెట్ కొన్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. తన ట్వీట్‌ను కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, ఐఆర్‌సీటీసీ, రైల్వేమంత్రిత్వశాఖ అధికారులు, మీడియా సంస్థలకు ట్యాగ్ చేశారు.
ముందుగా అతడు రైల్వే హెల్ప్‌లైన్ (139)ను సంప్రదించాడు. రైలులో సిబ్బంది పురుగు మందును పిచికారీ చేసినట్లు తెలిపారు. ప్రయాణికుడు ఎక్స్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే కోచ్‌లోని సీట్ల వద్ద పరిశుభ్రంగా చేశామని, లైజాల్‌తో వెట్ స్వీపింగ్ చేసినట్లు సిబ్బంది పేర్కొన్నారు. ఆ తర్వాత సీటింగ్ ఏరియా కింద దోమల నివారణ మందును స్ప్రే చేశారని, సీటు కింద గ్లూ ప్యాడ్‌ను పెట్టామన్నారు.
మరోవైపు వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ పరిస్థితిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు భారతీయ రైల్వే ప్రయాణికులకు సాధారణ అనుభవం అంటూ కామెంట్లు పెట్టారు. కొందరు వ్యంగంగా స్పందించారు. మరికొందరు రైలులో అపరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.