Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ వేళ.. యూకే విదేశాంగ మంత్రితో జైశంకర్ చర్చలు

Jaishankar holds talks with UK Foreign Secretary : ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న వేళ.. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ యూకే ఫారెన్ వినిస్టర్ డేవిడ్ ల్యామితో చర్చలు జరిపారు. సమావేశంలో ఇండియా తరఫున ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న నేపథ్యంలో నిధులు ఇవ్వడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ టెర్రరిజాన్ని వదులుకోవడానికి కూడా అంత సానుకూలంగా లేదని ఇండియా చెబుతోంది.
బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ..
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతిగా ఇండియా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తదితర విషయాలు బ్రిటన్ పార్లమెంట్‌లో బుధవారం చర్చకు వచ్చాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను ఉపసంహరింపజేయాలని ఎంపీలు తమ ప్రభుత్వానికి సూచించారు. సమస్యలను సంప్రదింపులు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ హమిష్ ఫాక్నర్ పార్లమెంట్‌లో చర్చను ప్రారంభించారు. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని కోరారు. ఇండియా, పాక్‌లతో బ్రిటన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తాము పహల్గాం ఉగ్రదాడిని నిర్ద్వంద్వంగా ఖండించామని ఫాక్నర్ గుర్తుచేశారు.
అమెరికా విదేశాంగ మంత్రి చర్చలు..
మరోవైపు దౌత్యపరంగా పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి భారత్ అన్ని యత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా సహా మిత్రదేశాలకు తాజా పరిస్థితిని వివరించింది. గురవారం రాత్రి కూడా కేంద్రమంత్రి ఎస్.జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో ఫోన్‌లో చర్చించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సహించబోమని ఆయన పేర్కొన్నారు.