Jagjit Singh Dallewal : రైతులకు రుణపడి ఉంటా.. నిరవధిక నిరాహార దీక్ష విరమించిన జగ్జీత్ సింగ్ దల్లేవాల్

Jagjit Singh Dallewal : దేశంలోని రైతన్నల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీతోపాటు పలు డిమాండ్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు గతేడాది నవంబర్ 26వ తేదీన దీక్ష చేపట్టారు. దీక్షను విరమించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రణ్‌వీత్‌సింగ్ బిట్టు విజ్ఞప్తి చేయగా, మరుసటి రోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో నిర్వహించిన ‘కిసాన్ మహా పంచాయత్’లో నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు దల్లేవాల్ ప్రకటించారు.
రైతులకు రుణపడి ఉంటా..
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని మీరంతా తనను కోరారని చెప్పారు. ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపినందుకు మీకు రుణపడి ఉంటానని తెలిపారు. మీ సెంటిమెంట్లను తాను గౌరవిస్తానని వ్యాఖ్యానించారు.
సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా కలిసి ఏర్పాటు చేసిన వేదికలో జగ్జీత్‌సింగ్ దల్లేవాల్ పాల్గొన్నారు. కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని కోరుతూ గతేడాది నవంబర్ 26న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో కేంద్రం జనవరిలో రైతులను చర్చలకు ఆహ్వానించడంతో దీక్ష చేపట్టిన స్థలంలోనే వైద్య సాయం తీసుకొనేందుకు ఆయన అంగీకరించారు. కానీ, తన నిరాహార దీక్షను మాత్రం కొనసాగించారు. శనివారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు కొనసాగుతున్నాయని, మే 4న ఉదయం 11గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దల్లేవాల్ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.