Published On:

Sunil Gavaskar : శుభ్‌మన్ వద్దు.. బుమ్రానే సరైనోడు.. సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sunil Gavaskar : శుభ్‌మన్ వద్దు.. బుమ్రానే సరైనోడు.. సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sunil Gavaskar interesting comments : ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియాపైనే కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతోపాటు స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వారి స్థానాలను భర్తీ చేసేదెవరని చర్చ నడుస్తోంది. కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో భారత జట్టు ఘోర పరాభవాలు చవిచూసింది. జూన్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగే కీలక సిరీస్‌కు టీమిండియా రోహిత్‌, విరాట్‌ లేకుండా వెళ్లనుండటం ఆసక్తిగా మారింది.

 

పనిభారం పడకుండా ఉండేందుకే?
ఇంగ్లండ్ సిరీస్‌ నుంచి యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ భారత్ టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై పనిభారం పడకుండా ఉండేందుకే బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే క్రమంలో తనకు తానుగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకొన్నాడని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

టెస్టు కెప్టెన్‌గా బుమ్రానే సరైనోడు..
భారత్ టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ను కాదని, బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రతిఒక్కరూ పనిభారం అంటూ బుమ్రా గురించి ఏదేదో మాట్లాడేస్తున్నారని చెప్పుకొచ్చారు. నిజానికి అతడికి మాత్రమే పనిభారం గురించి పూర్తిగా తెలుస్తుందని చెప్పారు. తన శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా? లేదా ? అనేది బుమ్రాకు మాత్రమే తెలుస్తుందని పేర్కొన్నారు.

 

ఆ కారణంతో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం సరికాదన్నారు. కెప్టెన్‌గా ఇతరులు ఎవరు ఉన్నా బుమ్రాతో అదనపు ఓవర్లు వేయించాలనే చూస్తారని, మరి అలాంటపుడు పనిభారం పెరగదా? అని ప్రశ్నించారు. జట్టులో బుమ్రా నంబర్‌ వన్‌ బౌలర్‌ అన్నాడు. తానే సారథిగా ఉంటే ఎప్పుడు విరామం తీసుకోవాలి.. ఎప్పుడు బరిలోకి దిగాలనే విషయాల్లో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకునే సత్తా అతడిలో ఉందన్నారు. అందుకే బుమ్రానే తదుపరి టెస్టు కెప్టెన్‌గా నియమించాలని కోరారు. పనిభారం అంటూ వచ్చే ఊహాగానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఏం చేయాలో బుమ్రాకు బాగా తెలుసు అన్నారు. కెప్టెన్‌గా అతడే ఉండటం అత్యుత్తమ నిర్ణయమని తన అభిప్రాయాన్ని గావస్కర్‌ స్పోర్ట్స్‌ టుడేతో చెప్పాడు.

ఇవి కూడా చదవండి: