Congress leader KC Venugopal: కశ్మీర్ అంశంపై అమెరికా ప్రమేయం ఉందా అనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేయాలి: కేసీ వేణుగోపాల్!

Congress leader KC Venugopal: భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగిన కాల్పుల విరమణకు తెరపడిన విషయం తెలిసిందే. తమ మధ్య వర్తిత్వంతోనే విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కశ్మీర్ అంశంపై అగ్రరాజ్యం అమెరికా ప్రమేయం ఉందా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
పార్లమెంటును అత్యవసరంగా సమావేశపర్చాలి..
మన దేశ విదేశీ విధానంలో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నాయా? భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి మూడో పక్షాన్ని అనుమతించి సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించారా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో తన జోక్యం ఉందని పేర్కొంటూ ప్రతిరోజూ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అంశాలపై చర్చించడానికి పార్లమెంటును అత్యవసరంగా సమావేశపర్చాలని ప్రధాని మోదీని ఇప్పటికే కోరినట్లు గుర్తుచేశారు. సమావేశ ఉద్దేశం పరిస్థతిని అంచనా వేయడానికే తప్ప.. ఒకరిని నిందించడానికి కాదన్నారు. ఏమైనా తప్పులు జరిగి ఉంటే అవి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
అమెరికా పాత్రపై సమాధానం చెప్పాలి..
భారత్-పాకిస్థాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ జరిగిందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. విరమణకు ముందే తమ మధ్యవర్తిత్వంతోనే జరిగిందని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. కాల్పుల విరమణలో అమెరికా పాత్రపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇదే విషయంపై వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ అంశాలపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలని లేఖలో వారు కోరారు.