Trump: సుప్రీం తీర్పును తప్పుబట్టిన ట్రంప్.. తన ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారని ఫైర్

USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండించారు. వెనెజులా నుంచి అమెరికాకు వలసవచ్చిన వారి బహిష్కరణకు సంబంధించిన కేసులో అక్కడి సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వెనెజులా వారిని బహిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు.
‘మన దేశంలోకి అక్రమంగా వచ్చిన వారిని బలవంతంగా పంపడాన్ని అనుమతించబోమని సుప్రీంకోర్టు ఇప్పుడే తీర్పు ఇచ్చింది. వలసొచ్చిన వాళ్లలో చాలమంది హంతకులు, మాదకద్రవ్యాల వ్యాపారులు, నేరస్థులు ఉన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో వారిని చట్టబద్ధంగా దేశం నుంచి పంపించాలంటే చాలా సమయం పట్టనుంది. ఈలోగా వాళ్లు దేశంలో అనేక నేరాలకు పాల్పడుతారు. ఇది అమెరికన్లకు హాని చేస్తుంది. కోర్టు తీర్పు మరింత మంది నేరస్థులు మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించడాన్ని ప్రోత్సహిస్తుంది. వారు ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టిస్తారు. గత అధ్యక్షుడు జోబైడెన్ లక్షలాది మంది క్రిమినల్స్ అక్రమంగా మన దేశంలోకి రావడానికి అనుమతించారు. వాళ్లను బయటకు పంపించేందుకు మాత్రం మనం సుదీర్ఘమైన, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలి. మన దేశాన్ని రక్షించడానికి ప్రయత్నించిన జస్టిస్ అలిటో, జస్టిస్ థామస్ కు కృతజ్ఞతలు. ఇది అమెరికాకు ప్రమాదకరమైన రోజు అని ట్రంప్ రాసుకొచ్చారు.
కాగా 1798 నాటి ఎనిమీస్ యాక్ట్ ను వినియోగించి అమెరికాలో ఉంటున్న వెనెజులాకు చెందిన గ్యాంగ్ ను బహిష్కరించాలని ట్రంప్ ప్రయత్నించారు. ఈ చర్యలకు అక్కడి సుప్రీంకోర్టు అడ్డంకిగా నిలిచింది. వారి బహిష్కరణను చట్టబద్ధంగా సవాల్ చేయడానికి వారికి తగినంత సమయం ఇవ్వాలని తీర్పునిచ్చింది.