Sita Ramula Kalyanam: శ్రీ సీతారామ కల్యాణ క్రతువు జరుగుతుందిలా..
కల్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలికారు.
Sita Ramula Klayanam: శ్రీరామ నవమి రోజున ఆగమ శాస్త్ర పద్దతిని అనుసరిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కన్నుల పండువగా సీతారాముల కల్యాణం నిర్వహిస్తుంటారు. లక్షల సంఖ్యలో భక్తులు సీతారామ కల్యాణ వేడుకల్లో పాల్గొని తరిస్తుంటారు. కానీ, భద్రాచలంలో జరిగే ఆ రామయ్య కల్యాణ వేడుక ఎంతో ప్రత్యేకమైనది. అంతటి విశిష్టమైన భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో నవమి రోజు జరిగే వేడుకలు. దానికి సంబంధించి వివరాలు మీ కోసం..
ఆగమశాస్త్ర పద్దతిలో
ఏ దేవుడు.. ఏ తిధి, నక్షత్రంలో జన్మించాడో అదే తిధి, నక్షత్రంలో కల్యాణం చేయాలంటూ ఆగమశాస్త్రం పేర్కొంది. అంటే శ్రీరాముడి పుట్టిన రోజు నాడే పెళ్లి జరుగుతుందన్నమాట. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్నంలో ప్రతీ ఏటా కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న సంప్రదాయం. ఈ ఏడాది ఈరోజు( మార్చి 30) చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నంలో భద్రాచలంలో వేడుకగా శ్రీరాముడు – సీతమ్మలకు కల్యాణం జరుగుతుంది.
తెల్లవారుజామునుంచే(Sita Ramula Kalyanam)
సాధారణంగా తెల్లవారుజామున 4 గంటల తర్వాత ఆలయంలో శ్రీరాముడిని సుప్రభాత సేవతో మేలుకొలుపుతారు.ఆ తర్వాత తిరువారాధణ,మంగళశాసనం,అభిషేకం లాంటి పూజాదికార్యాలు నిర్వహిస్తారు. కానీ శ్రీరామ నవమిని పురస్కరించుకుని గర్భగుడిలో ఉన్న సీతారాములను రాత్రి రెండు గంటలకే మేలుకొలుపుతారు. ఆ తర్వాత నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
గర్భగుడిలో లఘు కల్యాణం(Sita Ramula Klayanam)
వేలాది మంది భక్తుల నడుమ శ్రీరామ నవమి రోజున అభిజిత్ లగ్నంలో ఎంతో వైభవంగా మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. అయితే అంతకంటే ముందే గర్భగుడిలో కొలువై నిత్యం భక్తులను ఆశీర్వదించే పట్టాభిరాముడికి పెళ్లి వేడుకు నిర్వహించారు. ఉదయం 8 గంటల సమయంలో భద్రాచల ఆలయం గర్భగుడిలో ఉన్న మూల విరాట్‌లకు శాస్త్రోక్తంగా లఘు కల్యాణం జరిపారు. నలభై నిమిషాల వ్యవధిలోనే ఈ పెళ్లి తంతును ముగిసింది. ఆ తర్వాతే మిథిలా స్టేడియంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు వైభవంగా అభిజిత్ లగ్నంలో పెళ్లి వేడుక జరుగుతోంది.
ఏడడుగుల వేడుక..
ఉదయం 9:30 గంటల తర్వాత జనక మహారాజు పుత్రిక, దశరథ మహారాజు జేష్టపుత్రుడి వివాహ వేడుక పనులు ప్రారంభమయ్యాయి. శంక, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన రాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో వెలుపలకు తీసుకువచ్చారు. కల్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలికారు. ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన లక్ష్మణ సమేత సీతారాముడు మిథిలా స్టేడియంలో అద్భుత శిల్పకళకు నెలవైన కల్యాణ మండపానికి చేరుకున్నారు.
మండప శుద్ధి
కల్యాణ మండపానికి చేరుకున్న సీతారాముడు, లక్ష్మణుడిని అక్కడ వెంచేపు చేశారు. కల్యాణ వేడుకలకు ఎలాంటి విఘ్నాలు రాకుండా ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహించారు. పుణ్యాహవచనం మంత్రాలను జపిస్తూ కల్యాణ వేడుకలకు ఉపయోగించే స్థలం, వస్తువులు, ప్రాంగణం, వేడుకలో పాల్గొనే వారిని మంత్ర జలంతో శుద్ధి చేశారు.
రాముడి ఎదురుగా సీతమ్మ
శ్రీయోద్వాహము నిర్వహించి అప్పటి వరకు మండపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చొబెట్టారు.
యజ్ఞోపవీతధారుడైన శ్రీరాముడు సీతమ్మ ఎదురుగా కల్యాణానికి సిద్ధమమ్యాడు
సీతారాములు ఎదురెదురుగా కూర్చున్న తర్వాత సీతమ్మకు యోక్త్రా బంధనం చేశారు.
యజ్ఞోపవీతధారణ, యోక్త్రాబంధన కార్యక్రమాలు జరిగిన తర్వాత సీతారాముల వంశగోత్రాల ప్రవరలు జరిగాయి. సాధారణంగా ఏక్కడైనా శ్రీరాముడిది వశిష్ట గోత్రం, సీతమ్మది గౌతమ గోత్రంగా చెబుతారు. కానీ భద్రాచలంలో శ్రీరాముడి గోత్రాన్ని అచ్యుత, సీతమ్మ గోత్రాన్ని సౌభాగ్య గోత్రంగా చెప్పడం విశేషం.
అలంకరణ
కల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపచేశారు.
అనంతరం రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చల హారం రామయ్యకు అలంకరణగా ఉపయోగించిరు. లక్ష్మణుడికి రామమాడను ధరింపచేశారు.
అనంతరం సీతారాములకు తేనే, పెరుగు కలిపిన మధుపర్కంతో నివేదన చేశారు.
ళ్లి తంతు నిర్వహించే ఆచార్య, బ్రహ్మలు శ్రీరాముడికి పాదప్రక్షాళన చేశారు.
వేదమంత్రాలను ఉచ్చరిస్తూ కన్యాదానం పురస్కరించుకుని భూదానం, గోదానాలను చేశారు.
ఏడు తరాల విశిష్టత
మంగళాష్టక మంత్రాలు జపిస్తూ శ్రీరాముడికి సంబంధించి ఎనిమిది శ్లోకాలను, సీతమ్మకు సంబంధించి ఎనిమిది శ్లోకాలను పఠిస్తారు. ఈ మంగళాష్టకంలో వధువరులకు సంబంధించిన ఏడు తరాలకు సంబంధించిన వివరాలను, ఘనతలను తెలియజేస్తారు.
అనంతరం నదీ స్నానం యొక్క ఉపయోగాలను వివరిస్తూ మహా సంకల్పం చెబుతారు
ఇలా సుమారు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక్కో పెళ్లి క్రతువు జరుగుతుంది.
అభిజిత్ లగ్నంలో
చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి కల్యానం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. సాధారణంగా నవమి రోజున అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటు ఇటుగా రావడం పరిపాటి. ముహూర్తం లగ్నం రాగానే వధువరులైన సీతారాముల తలలపై జీలకర్ర , బెల్లం ఉంచుతారు.
ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి మంగళపూజలు నిర్వహిస్తారు. అనంతరం మూడు బొట్లు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది.
ప్రత్యేకంగా తలంబ్రాలు
ముత్యాలు కలిపిన, గోటితో వొలిచిన తలంబ్రాలను వధువరులైన సీతారాములపై పోస్తారు. సాధారణంగా తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి. కానీ భద్రాచల రామయ్య కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి. ఇక్కడ తలంబ్రాల తయారీలో పసుపుతో పాటు గులాల్‌ను కూడా ఉపయోగించడం తానీషా కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది.
బ్రహ్మముడి
తలంబ్రాల కార్యక్రమం ముగిసిన సీతారాములకు తర్వాత తాత్కాలిక నివేదన చేయిస్తారు.
నివేదన అనంతరం సీతమ్మ చీరకు, రామయ్య పంచె, ధోతితో కలుపుతూ బ్రహ్మముడి వేస్తారు. అనంతరం మంగళ హారతి అందిస్తారు.
బ్రహ్మముడి అనంతరం కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు.