Last Updated:

Farmers Awareness Conference: 30న పాలమూరులో రైతు సదస్సు .. అధునాతన సాగు పద్ధతులు, మెళకువలపై అవగాహన

Farmers Awareness Conference: 30న పాలమూరులో రైతు సదస్సు .. అధునాతన సాగు పద్ధతులు, మెళకువలపై అవగాహన

CM Revanth Reddy’s order to hold an Farmers Awareness Conference in mahaboobnagar: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఈ నెల 30న జరగనున్న రైతు సదస్సులో రాష్ట్రంలోని రైతులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలా నిర్వహించాలని సూచించారు. శనివారం సీఎం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌ రావుతో కలిసి వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. రైతు సదస్సుపై ప్రధానంగా చర్చించారు.

రైతు ఉత్పత్తులతో స్టాల్స్
వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్ధతులు, మెళకువలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, వివిధ కంపెనీల వినూత్న ఉత్పత్తులను స్టాళ్లల్లో ఉంచాలని సూచించారు. అధునాతన పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లను ప్రయోగాత్మక ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలన్నారు. రైతులకు మూడు రోజులపాటు సదస్సు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 28 నుంచి స్టాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. దీంతో రాష్ట్రంలోని రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.

ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రీయల్ పార్క్: సీఎం
హైదరాబాద్, కిరణం : కొడంగల్‌లో ప్రభుత్వం తలపెట్టింది ఫార్మా సిటీ కాదని, అది ఇండస్ట్రీయల్ పార్క్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లగచర్ల ఘటనపై శనివారం వామపక్ష పార్టీల ప్రతినిధులు సీఎంను కలిసి అక్కడి పరిస్థితుల గురించి వివరించటంతో బాటు ప్రభుత్వ ఆలోచనల మీద తమకున్న అనుమానాలను వామపక్ష నేతలు వ్యక్తంచేశారు. దీనికి బదులిచ్చిన ముఖ్యమంత్రి కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని, తనను గెలిపించిన ప్రజలను తానెందుకు ఇబ్బంది పెడతానని అన్నారు. నియోజకవర్గంలోని యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమన్నారు. కొడంగల్ లో కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భూసేకరణ పరిహారం పెంపును సైతం పరిశీలిస్తామన్నారు. భూసేకరణ నేపథ్యంలో గురువారం వామపక్ష పార్టీలు వికారాబాద్ జిల్లా లగచర్ల, రోటిబండ తండాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.