CM Revanth Reddy: నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్.. ఈ నెల 23కి కేసు విచారణ వాయిదా

CM Revanth Reddy Attends Investigation in Nampally Court: సీఎం రేవంత్‌రెడ్డి గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, హైదరాబాద్‌లోని బేగం బజార్, తిరుమలగిరి, పెద్దవూర, కమలపూర్‌తోపాటు నల్లగొండ టూటౌన్‌లో మొత్తం తొమ్మిది కేసులు రేవంత్‌పై నమోదయ్యాయి.
కేసు విచారణను ఈ నెల 23కి వాయిదా..
ఈ కేసుల్లో సీఎం రేవంత్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ గత ఎన్నికల్లో వీడియో సైతం విడుదల చేసిన వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది. ఆ సమయంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ ఉన్నారు. తనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణలో భాగంగా రేవంత్ నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.
మహా కుంభాభిషేక సంప్రోక్షణకు రండి..
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం బంగారు విమాన గోపురం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. గురువారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్‌తోపాటు ఆలయ ఈవో, అర్చకులు, జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 23న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ దేవస్థానంలో బంగారు విమాన గోపురం మహా కుంభాభిషేక ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహోత్సవం నిర్వహించనున్నారు. ఇప్పటికే గోపురానికి బంగారు తాపడం అమర్చే పనులు ఇటీవల పూర్తి అయ్యాయి. దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డుకెక్కింది. గోపురం 55 అడుగులతో, 68 కిలోల బంగారం గోపురానికి తాపడం కోసం వినియోగించారు. అయితే ఇప్పటికే దాదాపు రూ.70 కోట్లతో స్వర్ణ తాపడం పనులు ప్రారంభించారు.
నేడు ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన..
తెలంగాణ ప్రజలకు సర్కారు శుభవార్త తెలిపింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం సీఎం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా నారాయణపేట మండలంలోని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి, రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇండ్లు విడుదల కాగా, వాటన్నింటికీ నేడు శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి.