CM Revanth Reddy: సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తాం.. సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌లో సీఎం రేవంత్

CM Revanth Reddy Attends Cyber Security Conclave-2025 at HICC: సైబర్ భద్రతలో దేశంలోనే తెలంగాణను ప్రథమస్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025కు ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డితో కలసి సీఎం రేవంత్ పాల్గొన్నారు. సైబర్ నేరాలు నేడు వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థల స్థాయికి పెరగటం మీద ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణను సైబర్ సెక్యూరిటీకి సురక్షిత బిజినెస్ జోన్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం పిలుపునిచ్చారు.
అప్రమత్తతే కీలకం..
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిందని సీఎం గుర్తుచేశారు. సైబర్ నేరాల కేసులలో సొమ్ము రికవరీ సాధించటంలోనూ సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. ఈ విషయంలో రాష్ట్రం పనితీరును మెచ్చుకుని కేంద్ర ప్రభుత్వం అవార్డులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. నిరుడు సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని సీఎం గుర్తుచేశారు. గతంలో ఇళ్లలో పడి దొంగలు దోచుకుంటే.. నేడు ఇంటర్ నెట్ ఆధారంగా ఎక్కడో ఉండి నేరగాళ్లు ప్రజల ఖాతాలు ఖాళీ చేస్తున్నారని అన్నారు. మారుతున్న నేరాల శైలిని బట్టి మన వ్యవస్థల్లోనూ మార్పులు రావాలిన సీఎం అభిప్రాయపడ్డారు.
డీప్‌ఫేక్‌తో చిచ్చు..
డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 14 రాష్ట్రాల నుంచి పోలీసు అధికారులు ఈ కాన్‌క్లేవ్‌కు హాజరు కావడం ఆనందంగా ఉందని అన్నారు.సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని గుర్తుచేశారు. 2024లో సైబర్ నేరాల్లో కాజేసిన రూ.350 కోట్లు సీజ్ చేయటంతో బాటు రూ.183 కోట్లను 18 వేల మంది బాధితులకు తిరిగి అందించామని తెలిపారు.
చైతన్యం పెరగాలి..
సైబర్ నేరాల నియంత్రణ కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్ పై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. పోలీసులు కూడా ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజంలో మారుతున్న నేరాల రూపానికి అనుగుణంగా పరిపాలనా విధానంలో మార్పులు తీసుకురావాలని సీఎం కోరారు.