Rain Fall: సిటీలో దంచికొడుతున్న వర్షం.. ఇబ్బందులు పడుతున్న జనం

Hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. రాత్రి 7 గంటల నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బోరబండ, కూకట్ పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట, బాచుపల్లి, కొంపల్లి, గాజుల రామారం, సూరారం, జీడిమెట్ల, చార్మినార్, బహదూర్ పుర, ఫలక్ నుమా, చాంద్రయణగుట్ట, బార్కస్, శాలిబండ, సుల్తాన్ బజార్, నాంపల్లి, అబిడ్స్, బషీర్ బాగ్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్ నగర్, రాజేంద్రనగర్, బండ్లగూడ, జగద్గిరిగుట్ట, కిస్మత్ పూర్, నార్సింగి, మణికొండ, గండిపేటలో వర్షం పడింది.
వర్షం కారణంగా సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు ఇండ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వల్ల హైటెక్ సిటీ, లింగంపల్లి రూట్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మరోవైపు వచ్చే 3 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వర్షాలతో వాతావరణం చల్లబడటంతో.. ఎండల నుంచి ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు.