TG High Court: హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ కుప్పకూలిన న్యాయవాది

Telangana High Court Senior Lawyer Passed Away With Heart Attack: దేశంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. ఆరు నెలల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, సినిమా చూస్తూ ఇంకొకరు, కూర్చొన్న వారు కూర్చున్నట్టే క్షణాల్లో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణ హైకోర్టులో జరిగింది.
సీనియర్ న్యాయవాదికి గుండెపోటు..
తెలంగాణ హైకోర్టులో విషాదం నెలకొంది. హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌రావు గుండెపోటుకు గురయ్యారు. కేసును వాదిస్తున్న సమయంలో న్యాయవాది ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే తోటి లాయర్లు ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యలో వేణుగోపాల్ రావు మృతి చెందారు. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్‌లలో జడ్జిలు విచారణను నిలిపివేశారు. అన్ని కోర్టులో విచారణలు నేటికీ వాయిదా వేశారు.
లంచ్ విరామం తర్వాత..
హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం లంచ్ విరామం తర్వాత ఓ కేసు విషయంలో వేణుగోపాల్ తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన తోటి న్యాయవాదులు సీపీఆర్ చేసినప్పటికీ కూడా లాయర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యలోనే వేణుగోపాల్‌రావు ప్రాణాలు కోల్పోయారు. కేసువాదిస్తూ పడిపోయిన సమయంలో కళ్లు తిరిగి పడిపోయారని అంతా భావించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో న్యాయవాది మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. న్యాయవాది మృతి పట్ల లాయర్లు విచారం వ్యక్తం చేస్తూ అన్ని విచారణలను వాయిదా వేశారు. సీనియర్ న్యాయవాది మృతితో తోటి లాయర్లు ఆవేదన వ్యక్తం చేశారు.