Last Updated:

YS Sharmila: గుర్తింపు కోసమే షర్మిల ఆరాటం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తెలంగాణలో రెచ్చిపోతున్నారు. అధికార, విపక్ష నాయకులను ఏకిపారేస్తున్నారు.

YS Sharmila: గుర్తింపు కోసమే షర్మిల ఆరాటం

YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తెలంగాణలో రెచ్చిపోతున్నారు. అధికార, విపక్ష నాయకులను ఏకిపారేస్తున్నారు. అయినా పెద్దగా స్పందించడంలేదు నాయకులు. ఒక్క జగ్గారెడ్డి మాత్రమే రియాక్టయ్యారు. అసలు..తెలంగాణలో షర్మిల స్ట్రాటజీ ఏంటి?

త‌న అన్న వైఎస్ మాట కాద‌ని ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్టారు. వైఎస్సార్‌టీపీ అధినేత్రి అనిపించుకున్నారు. కానీ ఆమె ఆశ‌యం తెలంగాణ సీఎం కావ‌డం. చాలా మందికి రాజ‌కీయంగా ఎన్నెన్నో ఆశ‌లు ఉండొచ్చు. అయితే ఆశ‌ల్ని, ఆశ‌యాల్ని కొంద‌రు మాత్రమే నెర‌వేర్చుకోగ‌ల‌రు. ఇందుకు ప్రకృతి, భౌగోళిక‌, సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక త‌దిత‌ర ప‌రిస్థితులు అనుకూలించాలి.వైఎస్ ష‌ర్మిల ప్రస్తుతం తెలంగాణ‌లో పాద‌యాత్ర చేస్తున్నారు. గ‌తంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆమె పాద‌యాత్ర చేసి రికార్డు సృష్టించారు. తెలుగు స‌మాజంలో ష‌ర్మిల మాదిరిగా ఒక మ‌హిళ సుదీర్ఘ పాద‌యాత్ర చేసిన దాఖ‌లాలు లేవు. వైఎస్సార్ కూతురిగా రాజ‌కీయ అరంగేట్రానికి ష‌ర్మిలకు సులువు అయ్యింది. అయితే ష‌ర్మిల పోయిన చోట వెతుక్కోకుండా, మ‌రెక్కడో అన్వేషిస్తోందన్న టాక్‌ వినిపిస్తోంది.. ఇదే ఆమె రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు అడ్డంకిగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణ ఆవిర్భావం వెనుక బ‌ల‌మైన ఆంధ్రా వ్యతిరేక‌త వుంది. ఆంధ్రా వాళ్లు త‌మ ప్రాంతానికి వ‌చ్చి దోచుకుంటున్నార‌నే ఆవేద‌న‌, ఆగ్రహం తెలంగాణ స‌మాజంలో వుంది. ఆంధ్రా పాల‌కుల సంత‌తి నుంచి వ‌చ్చిన త‌న‌ను తెలంగాణ స‌మాజం ఆద‌రిస్తుంద‌ని ష‌ర్మిల ఎలా అనుకున్నారో ఆమెకే తెలియాలంటున్నారు పరిశీలకులు.తెలంగాణలో ష‌ర్మిల పార్టీకి క‌నీస స్పంద‌న కూడా లేద‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో ష‌ర్మిల రాజ‌కీయ భ‌విష్యత్ ప్రశ్నార్థక‌మ‌వుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మొద‌లుకుని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌పై ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శలు చేస్తున్నారు. ష‌ర్మిల ఘాటు వ్యాఖ్యలకు నేత‌లు నొచ్చుకుంటున్న ప‌రిస్థితి. అయిన‌ప్పటికీ ఆమె విమ‌ర్శల‌పై స్పందించ‌కూడ‌ద‌ని తెలంగాణ రాజ‌కీయ నేత‌లు భావించడం ష‌ర్మిల‌కు అస‌లు న‌చ్చడం లేదు.తెలంగాణ‌లో అస‌లు త‌న ఉనికినే గుర్తించ‌క‌పోవ‌డంపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పాద‌యాత్రలో భాగంగా సంగారెడ్డికి వెళ్లిన‌ప్పుడు అల‌వాటు ప్రకారం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిపై ష‌ర్మిల నోరు పారేసుకున్నారు. ఆశ్చర్యక‌రంగా జ‌గ్గారెడ్డి స్పందించారు. జ‌గ్గారెడ్డి రూపంలో త‌న రాజ‌కీయ ఉనికిని గుర్తించిన నాయ‌కుడు దొరికాడ‌ని… ఆమె మరింత రెచ్చిపోయారు.

నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే క‌నీసం త‌న‌ను గుర్తిస్తార‌ని ష‌ర్మిల ఉద్దేశంగా క‌నిపిస్తోంద‌నే విమ‌ర్శలు లేకపోలేదు.ష‌ర్మిల త‌న‌ను ఎంత ఘాటుగా విమ‌ర్శించినా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించ‌రో జ‌గ్గారెడ్డి తెలిసినట్టు లేదు. ఆ త‌త్వం బోధ‌ప‌డితే జ‌గ్గారెడ్డి మ‌రోసారి ష‌ర్మిల కామెంట్స్‌పై స్పందించ‌రు. కానీ త‌న రాజ‌కీయానికి దివంగ‌త వైఎస్సార్ ప‌రువు ఏమ‌వుతున్నదో ష‌ర్మిల ఒక్కసారి ఆలోచిస్తే మంచిద‌ని పౌర స‌మాజం హిత‌వు చెబుతోంది.

ఇవి కూడా చదవండి: