Ambati Rambabu: నిన్న పోలీసులతో గొడవ.. నేడు అంబటిపై కేసు నమోదు
Police Registered Case: మాజీ మంత్రి , వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులో నిన్న నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో అంబటి రాంబాబు పోలీసలతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
కాగా నిన్న పట్టాభిపురం సీఐపై ‘నీ అంతు చూస్తాను’ అంటూ పరుష పదజాలంతో అంబటి రాంబాబు విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే వెన్నుపోటు దినంలో పాల్గొనేందుకు గుంటూరులోని సిద్ధార్థనగర్ లోని తన నివాసం నుంచి అంబటి రాంబాబు బైకులపై ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుచెప్పారు. అయితే కుందులు రోడ్డు జంక్షన్ లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కలెక్టరేట్ కు వెళ్లేందుకు కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వరకు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని సీఐ వెంకటేశ్వర్లుతో వాగ్వావాదానికి దిగారు. పోలీసులను నెట్టే ప్రయత్నం చేశారు. కాగా ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జి మీదకు ఒకేసారి అంతమంది వెళ్లేందుకు అవకాశం లేదని సీఐ చెప్పారు. దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు.. ఎలా పోనివ్వరో చూస్తానంటూ సీఐపై మండిపడ్డారు. సీఐపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఐ అలా మాట్లాడోద్దని అంబటిని వారించారు.