Weather: అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Rain Alert To Telugu States: నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. కానీ అనుకున్నంతగా వర్షాలు పడట్లేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు తప్ప.. సరైన వర్షాలు కురవట్లేదు. ఇక తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ 18 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
మరోవైపు ఏపీలోనూ నేడు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. ఇక ఉమ్మడి కర్నూలు, విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు అవకాశం ఉందని చెప్పింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది.