Published On:

Chandrababu: సూపర్‌సిక్స్‌ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu: సూపర్‌సిక్స్‌ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం: ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu: ప్రతినెలా 1వ తేదీన గ్రామాలు కళకళలాడేందుకు పింఛన్లు ప్రధాన కారణమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ముఖ్యమంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడారు. సూపర్‌సిక్స్‌ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వేదికపై చంద్రబాబు డప్పు కొట్టారు.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీతాలు, పింఛన్లు సరిగా ఇవ్వలేదని ఆరోపించారు. తాము పేదలను ఆదుకునేందుకు ‘పేదల సేవలో’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పింఛన్ల కోసం నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఏపీని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని ఎన్నికల్లో చెప్పామని, గత వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. గతంలో వ్యవస్థలన్నీ పడకేశాయన్నారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు. అభివృద్ధి చేస్తామని, సంపద సృష్టిస్తామన్నారు. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతామన్నారు.

 

ఏపీని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా వెళ్తున్నామని చెప్పారు. సూపర్‌సిక్స్‌ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తల్లికి వందనం కింద రూ.10వేల కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్రతో 2 గిన్నిస్‌ రికార్డులు, 21 వరల్డ్‌ బుక్‌ రికార్డులు నెలకొల్పామని సీఎం తెలిపారు.

ఇవి కూడా చదవండి: