New Rules: సామాన్యుడి జేబుకు చిల్లు.. రేపటి నుంచి కొత్త రూల్స్

New Rules: జులై 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన నియమాలు మారబోతున్నాయి. ఇవి సామాన్యుల ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. వీటిలో పాన్ కార్డ్ నుంచి బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన నియమాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలు అమలు చేయబడిన వెంటనే.. మీ జేబుపై భారం పెరిగే అవకాశం ఉంది.
రైల్వే:
జులై 1 2025 నుంచి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో AC, నాన్-AC కోచ్ టికెట్ల ఛార్జీలను పెంచడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. నాన్-AC (స్లీపర్, సెకండ్ సీటింగ్ మొదలైనవి) కేటగిరీలకు కిలో మీటరుకు 1 పైసా, అన్ని AC తరగతులలో కిలోమీటరుకు 2 పైసాల ఛార్జీని పెంచనున్నారు. 500 కి.మీ వరకు ప్రయాణానికి సెకండ్ క్లాస్ టికెట్ రైలు టిక్కెట్ల ధరలు, MSTలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ దూరం 500 కి.మీ కంటే ఎక్కువగా ఉంటే.. ప్రయాణీకుడు కిలోమీటరుకు అర పైసా చెల్లించాలి.
తత్కాల్ టికెట్ బుకింగ్ :
ఇప్పుడు తత్కాల్ టిక్కెట్లు IRCTC అకౌంట్ తో ఆధార్‌తో లింక్ చేసిన ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జూలై నుంచి OTP ఆధారిత ప్రామాణీకరణ తప్పనిసరి అవుతుంది. ఇది ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వస్తుంది. తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల వరకు రైల్వే ఏజెంట్లు టిక్కెట్లను బుక్ చేసుకోలేరు.
పాన్ కార్డ్ నిబంధనలలో మార్పు:
ఆధార్ కార్డు తప్పనిసరి: ఇప్పుడు జూలై 1 నుంచి, కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేసుకునేటప్పుడు ఆధార్ కార్డును అందించడం తప్పనిసరి అవుతుంది. ఈ నియమాన్ని CBDT అమలు చేసింది. మీకు ఇప్పటికే పాన్ , ఆధార్ రెండూ ఉంటే.. వాటిని లింక్ చేయడం కూడా అవసరం. దీని కోసం డిసెంబర్ 31, 2025 వరకు సమయం ఇవ్వబడింది.
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు :
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) వ్యవస్థ తప్పనిసరి: అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లులను ఇప్పుడు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఇది బిల్ డెస్క్, ఫోన్‌పే, క్రీడ్ వంటి యాప్‌లను ప్రభావితం చేయవచ్చు. ప్రస్తుతం ఎనిమిది బ్యాంకులు మాత్రమే BBPSలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించాయి.
బ్యాంకింగ్ నియమాలలో మార్పులు:
ICICI బ్యాంక్ ATM ఛార్జీలు: బ్యాంకు ATM నుంచి 3 కంటే ఎక్కువ సార్లు మనీ డ్రా చేస్తే.. ప్రతి ఆర్థిక లావాదేవీకి ₹23, ఆర్థికేతర లావాదేవీకి ₹8.5 ఛార్జ్ చేయబడుతుంది.
HDFC బ్యాంక్ – ఆన్‌లైన్ గేమింగ్ ఛార్జీలు:
గేమింగ్ యాప్‌లపై నెలకు ₹10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 1% అదనపు ఛార్జీ విధించబడుతుంది.
వాలెట్ ఛార్జీలు:
Paytm వంటి మూడవ పార్టీ వాలెట్‌లకు ₹10,000 కంటే ఎక్కువ బదిలీ చేస్తే 1% ఛార్జీ విధించబడుతుంది.
దేశీయ గ్యాస్ ధరల్లో మార్పు :
వచ్చే నెలలో LPG సిలిండర్ల ధరల్లో మార్పు ఉంటుంది. ఈ ప్రక్రియను ప్రభుత్వం ప్రతి నెల ప్రారంభంలో నిర్వహిస్తుంది. జూన్ 1న, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర తగ్గించబడింది. ఆగస్టు 1, 2024 నుంచి దేశీయ గ్యాస్ సిలిండర్ అంటే 14 కిలోల LPG సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.