Puri Stampede: తొక్కిసలాట ఎఫెక్ట్.. కలెక్టర్, ఎస్పీ బదిలీ

Puri Stampede: ఒరిస్సా రాష్ట్రంలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలతో కూడిన మూడు పవిత్ర రథాలు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయానికి చేరుకున్నాయి. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రథాలు గుండిచా ఆలయం వద్దకు రాగానే, స్వామివార్ల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రథాలు సమీపించే కొద్దీ ఒక్కసారిగా జనసందోహం పెరిగిపోయింది. ఈ క్రమంలో కొందరు భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ప్రభాతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత్ మహంతిగా గుర్తించారు.
జగన్నాథ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి మోహన్ చరణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రభుత్వం తరఫున క్షమాపణలు కోరారు. భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని భక్తులు ఆరోపించారు. అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషాదానికి ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ట్రాన్స్ ఫర్ చేశారు. పూరీ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ ను బదిలీ చేశారు. చంచల్ రాణాను కొత్త కలెక్టర్ గా, పినాక్ మిశ్రా కొత్త ఎస్పీగా నియమించారు. వీరితో పాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో డీసీపీ విష్ణు, కమాండెంట్ అజయ్ పాహిలను కూడా సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారి అరవింద్ అగర్వాల్‌ను రథయాత్ర మొత్తం పర్యవేక్షణకు ఇన్‌చార్జ్‌గా నియమించారు.