CM Chandrababu: కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

CM Chandrababu Tour In Kuppam: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న సీఎంకు జిల్లా, నియోజకవర్గ నేతలు, కలెక్టర్, ఎస్పీ, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం తుంశి వద్ద ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్ట్ లో భాగంగా మొత్తం రూ. 1292. 74 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అందులో రూ. 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి.
అలాగే 1000 మంది మహిళా లబ్దిదారులకు కొత్తగా గ్యాస్ కనెక్షన్లను, 3041 మంది లబ్దిదారులకు పెన్షన్లు సీఎం అందించారు. రూ. 21.80 కోట్లతో పీఎం సూర్యఘర్ యోజన కింద 7488 ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్ టాప్ ప్యానళ్లు ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కుప్పం నియోజకవర్గంలో చెత్త సేకరణకు 130 ఎలక్ట్రిక్ ఆటోలను సీఎం ప్రారంభించారు. పేటీఎం సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లను ప్రారంభించారు. 400 అంగన్వాడీ సెంటర్లలో కేర్ అండ్ గ్రో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీఎం కుసుమ్ పథకం కింద రూ. 564 కోట్లతో వ్యవసాయ ఫీడర్లకు సౌర విద్యుత్ అందేలా కార్యచరణను మొదలుపెట్టారు. అలాగే 1387 మంది దివ్యాంగులకు ఉపకరణాలు, 400 మంది డ్వాక్రా మహిళలకు ఈ- సైకిళ్లు పంపిణీ చేశారు.