Heavy Flood: కృష్ణానది ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

Flood In Krishna River: ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి కృష్ణా నదిలో కలుస్తున్నాయి. దీంతో కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్ట్ లకు భారీగా వరద వస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కొత్తనీటితో ప్రాజెక్ట్ నీటిమట్టాలు పెరుగుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జులై మొదటి వారంలోనే ప్రాజెక్టులకు నీరు రావడంతో పంటలకు నీటి ఢోకా ఉండదని అనుకుంటున్నారు.
ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 26,903 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 17,638 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1625.52 అడుగుల నీటిమట్టం ఉంది.
మరోవైపు జూరాల ప్రాజెక్ట్ కు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి నీటిని దిగువ శ్రీశైలంలోకి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 70 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 66,746 క్యూసెక్కులు ఉంది. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318. 512 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్ల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇక ఎగువన జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 66,746 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 63,150 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875.6 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 160 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు ద్వారా జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. వరద మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే.. ప్రాజెక్ట్ గేట్లు తెరిచే అవకాశం ఉంది.
ఇక ఎగువ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు వరద రాక ప్రారంభమైంది. ప్రాజెక్ట్ కు 50, 771 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఔట్ ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 519.20 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 143.86 టీఎంసీల నీరు నిల్వ ఉంది.