Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండా ఇదే
AP: ఏపీ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. కాగా మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే అజెండా తయారు చేశారు. సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
కాగా నేటి సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అలాగే జీఏడీ టవర్ టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలపడంతోపాటు, హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకు ఆమోదం చెప్పనున్నారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలపై చర్చించనున్నారు. అలాగే వన మహోత్సవంపై మాట్లాడనున్నారు. ఇంకా అమరావతి రెండో దశలో 44 వేల ఎకరాల భూమిని సమీకరించే అంశంపై చర్చ జరగనుంది. అక్కడే 5 వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మంత్రివర్గం ఓకే చేయనుంది. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్ కాంప్లెక్స్, మరో 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.