Actress Pakija: సినీ నటి వాసుకి దీనస్థితికి స్పందించిన పవన్ కల్యాణ్.. రూ.2లక్షల ఆర్థిక సాయం

AP Deputy Chief Minister Pawan Kalyan: నటి వాసుకి ‘పాకీజా’గా తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచింది. ఒకప్పుడు తెలుగులో వైవిధ్యమైన పాత్రలతో అలరించింది. ప్రస్తుతం ఆమె ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆమె ఒక వీడియో విడుదల చేశారు. వీడియోను చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పాకీజా దీనస్థితి పవన్ దృష్టికి వచ్చింది. దీంతో మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పిలిపించి రూ.2లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఆర్థిక సాయాన్ని మండలిలో ప్రభుత్వ విప్ పి.హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వాసుకికీ అందజేశారు. ఆర్థికసాయం చేసిన పవన్‌కు కృతజ్ఞత చెబుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
పింఛన్ వచ్చేలా చూడండి..
ఇటీవల వాసుకి ఒక వీడియోను విడుదల చేశారు. తాను పూట గడవని దీనస్థితిలో ఉన్నట్లు తెలిపారు. తాను హాస్య నటి పాకీజా అని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు నమస్కారాలు అని చెప్పింది. తాను చాలా కష్టాల్లో ఉన్నానని వివరించింది. మూడేళ్లుగా షూటింగ్స్ లేక ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో తన సొంత గ్రామం కారైకుడికి వచ్చేశానని తెలిపింది. ఏదైనా సాయం చేస్తారేమోనని ముఖ్యమంత్రిని కలవడానికి రెండుసార్లు విజయవాడ వచ్చానట్లు వివరించిందతి. కానీ, కలవడం చాలా కష్టమైందని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ను కలవాలని ప్రయత్నించినా కలవలేకపోయానని తెలిపింది.
తమిళనాడులో తనకు ఆధార్ కార్డు ఉందన్నారు. ఆధార్ ఆధారంగా ఏపీలో నెలనెలా పింఛన్ వచ్చేట్లు ఏదైనా సాయం చేయాలని కోరారు. భర్త, పిల్లలు ఎవరూ లేరని, అనాథగా ఉంటున్నానని తెలిపారు. గతంలో చిరంజీవి, నాగబాబు సాయం చేశారని తెలిపారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ దయచేసి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తనకు కనీసం పింఛన్ అందేలా సాయం చేయాలని కోరారు. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించారు. వెంటనే రూ.2లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వాసుకి మాట్లాడారు. తమిళనాడులో ఎవరూ తనను పట్టించుకోలేదన్నారు. తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్‌కు తన స్థితి గురించి చెప్పగానే రూ.2లక్షలు ఆర్థిక సాయం చేశారని తెలిపారు. పవన్‌ది గొప్ప మనసు అని కొనియాడారు. చిరంజీవి, నాగబాబు అన్నయ్యలు సహా మెగా కుటుంబం చాలాసార్లు తనను ఆదుకుందని చెప్పారు. వదినమ్మ ఇచ్చిన చీరెలు కట్టుకుని బతుకుతున్నానని తెలిపారు. ఇప్పుడు ఆర్థికసాయం చేసి, తాము ఉన్నామని భరోసా ఇచ్చారని, ఇప్పుడు సంతోషంగా ఉందన్నారు.