Emergency Landing: సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నేడు తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేయాల్సి ఉంది. అనంతరం గ్రామసభలు నిర్వహించి, పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు ఉండవల్లి నివాసం నుంచి తూర్పుగోదావరి జిల్లా కాపవరం వెళ్లి అక్కడి నుంచి మలకపల్లి వెళ్లాల్సి ఉంది.
కానీ ఉండవల్లి నుంచి బయల్దేరిన వెంటనే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణం సరిగా లేకపోవడంతో గన్నవరం ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రాజమండ్రికి వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మలకపల్లి వెళ్లనున్నారు.
కాగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అలాగే వర్షం పడే ఛాన్స్ ఉందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సమాచారం వచ్చింది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు సైతం సమాచారం ఇవ్వడంతో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్ టేకాఫ్ చేశారు. కానీ వాతావరణం అనుకూలంగా లేదని తెలుసుకున్న పైలట్ వెంటనే గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అనంతరం గన్నవరం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో రాజమండ్రికి వెళ్లారు.