Deputy CM Pawan Kalyan: ప్రమాదంలో పవన్ భద్రత.. చంపేస్తామని హెచ్చరించిన ఆగంతకులు
Threatening Calls To Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని పేషీ అధికారులు.. పవన్ కల్యాణ్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై హోంశాఖ మంత్రి అనిత.. డీజీపీతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని డీజీపీ.. హోంమంత్రి అనితకు తెలిపారు. వెంటనే దర్యాప్తు జరిపి ఆగంతకుడిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత.. డీజీపీని అదేశించారు.
వారి పనేనా?
ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. కాకినాడ పోర్టుకు పర్యటనకు రావద్దంటూ అధికారులు రకరకాల కారణాలతో తనను చాలాకాలం అడ్డుకున్నారని కూడా పవన్ చెప్పారు. పవన్ అక్కడికి వెళ్లినప్పటి నుంచి కాకినాడ పోర్టు వ్యవహారం వెలుగులోకి రావటం, కేంద్రం సైతం పోర్టుపై ప్రత్యేక నిఘా పెట్టటంతో పోర్టు కేంద్రంగా అక్రమదందాకు ఇక ఆస్కారం లేదనే భావన ప్రజల్లో ఏర్పడింది. అయితే, ఐదేళ్లలో సుమారు రూ. 45 వేల కోట్ల అక్రమ రేషన్ బియ్యం రవాణా చేసిన మాఫియాకు ఇది కంటగింపుగా మారింది. తాజాగా వచ్చిన బెదిరింపులు అందుకు సంబంధించిన వ్యక్తుల నుంచేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే డ్రగ్స్ కట్టడికి పవన్ తీసుకుంటున్న చొరవ కూడా గత ఐదేళ్లుగా ఏపీని గంజాయికి అడ్డాగా మార్చిన శక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో వారు బెదిరింపులకు పాల్పడే అవకాశముందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే తొలిసారి కాదు..
నిజానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బెదిరింపు కాల్స్ రావటం, వార్నింగ్స్ ఇవ్వటం ఇదే తొలిసారి కాదు. 2022 నవంబరులో ఆయన ఇంటివద్ద కొందరు రెక్కీ నిర్వహించటం, ఆయన విశాఖ పర్యటన సందర్భంగా కారును అడ్డుకునే యత్నం చేయటం జరిగాయి. అలాగే, ఇటీవల సనాతన ధర్మం విషయంలో పవన్ ఉద్యమించినప్పుడు, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసినప్పుడు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1న స్వయంగా తన భద్రత విషయంపై పవన్ హాట్ కామెంట్స్ చేశారు. ఏప్రిల్ 1న పిఠాపురం సభలో మాట్లాడుతుూ.. ‘నాకూ అభిమానులతో ఫొటోలు దిగాలని ఉంటుంది.
Y చాలదు.. Z కేటగిరీ కావాలి..
ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు కేవలం ‘Y’ కేటగిరీ భద్రత మాత్రమే ఉంది. Y కేటగిరీలో 11 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. ఇందులో ఇద్దరు కమాండోలు, పోలీసులు, పర్సనల్ సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఇతరుల నుంచి బెదిరింపులున్న నేతలకు కేంద్రం ఈ తరహా భద్రతను కల్పిస్తుంది. అయితే, పవన్ వంటి జనాకర్షక నేతకు ఈ స్థాయి భద్రతతో ఒరిగేదేం లేదని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఆయన ఎక్కడ నిలబడినా గంట వ్యవధిలో పదేసి వేల మంది పోగవుతారని, మరి అలాంటప్పుడు ఈ భద్రత ఏ మూలకూ చాలదని వారు అభిప్రాయపడుతున్నారు.