Last Updated:

Manchu Manoj: నాకు న్యాయం చేయండి – తండ్రి మోహన్‌ బాబు ఫిర్యాదుపై మనోజ్‌ రియాక్షన్‌

Manchu Manoj: నాకు న్యాయం చేయండి – తండ్రి మోహన్‌ బాబు ఫిర్యాదుపై మనోజ్‌ రియాక్షన్‌

Manchu Manoj Released Press Note: నటుడు మంచు మోహన్‌ బాబు కుటుంంబంలో వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎట్టకేలకు అసలు విషయాన్ని మంచు మనోజ్‌ బట్టబయలు చేశాడు. రెండు రోజులు మంచు ఫ్యామిలీలో ఘర్షణ జరిగింది, తన కొడుకు మనోజ్‌పై మోహన్‌ బాబు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సోమవారం మోహన్‌ బాబు పీఆర్‌ టీం ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదంటూ ఓ ప్రకటన ఇచ్చింది. కానీ, ఇది జరిగిన కాసేపటికే మనోజ్‌ గాయాలతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

చికిత్స అనంతరం కాసేపటికే మనోజ్‌ తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీ షరీఫ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మనోజ్‌ ఫిర్యాదు అనంతరం మోహన్‌ బాబు రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు మనోజ్‌ అతడి భార్య మౌనిక వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు మనోజ్‌పై 329,351,115 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయితే తన తండ్రి తనపై చేసిన ఆరోపణలపై కొన్ని గంటల క్రితం మనోజ్‌ ఓ ట్వీట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ ద్వారా సుదీర్ఘ లేఖ విడుదల చేశాడు.

నా గొంతు నొక్కడానికి ఇదంతా..

‘నాపై నా భార్య మౌనికపై నా తండ్రి డాక్టర్ ఎం. మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన తప్పుడు ఆరోపణలు నాకు బాధ కలిగించాయి. నా తండ్రి చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దం. నా పరువు, నా గొంతును నొక్కడానికి, కుటుంబ కలహాలు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నంలో ఇదొక భాగం అంటూ మనోజ్‌ కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను కూడా ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు.

  • నేను ఎప్పుడూ ఆర్థిక సహాయం కోసం నా కుటుంబంపై ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తులను కోరలేదు. నేను ప్రస్తుతం ఒక సంవత్సరం నుండి మా నాన్న ఇంట్లోనే నివసిస్తున్నాను
  • నా సోదరుడు (మంచు విష్ణు) దుబాయ్‌కి వెళ్లిన తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉన్నందున నన్ను ఇంటికి రమ్మని మా నాన్న పిలిచారు. అప్పుడు నేను నా కుటుంబంతో కలిసి మా నాన్నకు చెందిన ఇంట్లోకి మారాను. ఏడాదికిపైగా అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య (మౌనిక రెడ్డి) ప్రెగ్నెంట్‌గా ఉంది. నేను తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో నిజం లేదు. నన్ను, నా భార్యను తప్పుగా ఇరికించే ఉద్దేశ్యంతో ఈ ఆరోపణ చేశారు. నేను ఆ ఇంట్లో నివసిస్తున్నానని నిర్ధారించుకోవడానికి గత సంవత్సరం నుంచి నా మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్‌ను ధృవీకరించాల్సిందిగా అధికారులను కోరుతున్నాను.
  • ఈ గొడవలోకి నా 7 నెలల కుమార్తెను లాగడం చాలా బాధకరమైనది, అమానవీయం ఘటన. ఇలాంటి వివాదంలోకి నా పిల్లలను లాగడం వెనకున్న ఉద్దేశం ఏంటి? కుటుంబ పెద్దల పట్ల అత్యంత గౌరవం చూపే నా భార్యపై ఉద్దేశాలు ఆపాదించబడటం దురదృష్టకరం.
  • ఇంట్లో పనిచేసే మహిళలను మా నాన్న అనుచిత వ్యాఖ్యలతో తిడుతూ ఉంటారు. ఆయన మాటలకు వారంత తీవ్రమైన మనోవేదనకు గురయ్యేవారు. అంతేకాదు ఆయన అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం అభద్రత భావంతో ఉంటారు. అందుకు అవసరమైన అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశామని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మా అమ్మ పర్యవేక్షణతో పాటు ఆయా వద్ద మా కూతురిని ఉంచాం. నా భార్య, నేను కేవలం నాకు తగిలిన గాయాల వైద్య చికిత్స కోసం ఆ సమయంలో హాస్పిటల్‌కి వెళ్ళాం.
  • విష్ణు సహచరులు విజయ్‌రెడ్డి, కిరణ్‌లు సీసీటీవీ డ్రైవ్‌లను ఎందుకు తొలగించారు? ఈ వివాదంలో వారు ఏమి దాచడానికి ప్రయత్నిస్తున్నారు? ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరుతున్నాను.
  • నేను ఎల్లప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను, నా కృషి, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల ఆశీర్వాదం వల్ల నా వృత్తిని నిర్మించుకున్నాను. నేను ఎనిమిదేళ్లకు పైగా మా నాన్న, సోదరుల చిత్రాల కోసం అవిశ్రాంతంగా పని చేశాను. ఈ క్రమంలో అనేక పాటలు, ఫైట్లు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. తరచుగా కమర్షియల్ హీరోగా నా స్థాయికి తగ్గ పాత్రలను పోషిస్తున్నాను. ఒక్క రూపాయి తీసుకోకుండా నా కుటుంబ ప్రయోజనాల కోసమే ఇదంతా చేశాను. అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా విధ్వంసానికి గురయ్యాయి. నా సోదరుడు విష్ణు ఇప్పటికీ మా నాన్న నుంచి మద్దతు, ప్రయోజనం పొందుతూనే ఉన్నాడు.
  • నేను ఎప్పుడూ ఆస్తులు లేదా వారసత్వం ఆస్తులు కోసం అడగలేదు. నేను అడిగి ఉంటె సాక్ష్యాలు అందించమని సవాలు చేస్తున్నాను. కుటుంబ సంపదపై ఆధారపడకుండా నా జీవితం, నా స్వంత యోగ్యతతో నా పిల్లలను గౌరవంగా పోషించుకుంటున్నందుకు గర్వపడుతున్నాను.
  • విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ వల్ల మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ) విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారు. వారికి మద్దతుగా నేను బహిరంగంగా మాట్లాడటం వల్లే నాపై ఫిర్యాదు చేశారు. వారి ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తాను.
  • నా తండ్రి ఎప్పుడూ కూడా విష్ణుకు మద్దతుగానే ఉంటూ వచ్చారు. కుటుంబ విషయంలో నా త్యాగాలు ఉన్నప్పటికీ ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పటికే పరువు నష్టంతో పాటు పలుమార్లు వేధింపులకు గురయ్యాను. విష్ణు స్వలాభం కోసం కుటుంబం పేరును వాడుకుంటూ వచ్చాడు. కానీ, నేనెప్పుడూ స్వతంత్రంగానే జీవిస్తూ వస్తున్నాను. పైన చెప్పిన అంశాలకు సంబంధించిన అధికారులకు పూర్తి ఆధారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

ఇవి కూడా చదవండి: