Manchu Manoj: అత్తరు సాయిబుగా మారిన మంచు వారసుడు.. ?

Manchu Manoj: మంచు కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా మారి, నిర్మాతగా ఎదిగి.. ఒక విశ్వ విద్యాలయాన్ని స్థాపించి ఎంతోమంది పిల్లలకు చదువు నేర్పిస్తున్న మంచు మోహన్ బాబు పరువును.. తన ఇద్దరు కుమారులు రోడ్డున పడేశారు. ఆస్తి తగాదాల వలన మంచు విష్ణు, మంచు మనోజ్ నెలకోసారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇచ్చుకుంటున్నారు. ఇక తప్పు ఎవరిది అయినా బలిపశువును మాత్రం నేనే అయ్యాను అని మనోజ్ నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు.
ఇక ఇదంతా పక్కన పెడితే.. మంచు మనోజ్ హీరోగా మంచి సినిమాల్లోనే నటించాడు. ఇక ఇంటి సమస్యల వలన వెండితెరకు దూరమయిన మనోజ్.. భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు. వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ ను కూడా రీఎంట్రీ ప్లాన్ చేశాడు. ఇప్పటికే మనోజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి భైరవం.. రెండు మిరాయ్. ఈ రెండు కాకుండా ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి కానీ, అవి సెట్స్ మీదకు రాకుండానే ఆగిపోయాయి.
మొదట వాట్ ది ఫిష్ సినిమాలో మనోజ్ హీరోగా అనౌన్స్ చేశారు. కానీ, అది కొన్ని కారణాల వలన ఆగిపోయింది. కొద్దిగా గ్యాప్ తరువాత ఆ కథను లేడీ ఓరియెంటెడ్ గా మార్చి మెగా డాటర్ నిహారికతో ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇంకొకటి అహం బ్రహ్మాస్మి. ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఆగిపోయిన సినిమాల గురించి పట్టించుకోకుండా మనోజ్ తదుపరి సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే భైరవం రిలీజ్ కు రెడీ అవుతుంది. మిరాయ్ పాన్ ఇండియా లెవెల్లో వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
ఇక తాజాగా మనోజ్ మరో కొత్త సినిమాను లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార్తికేయతో 90 ML సినిమా తీసిన శేఖర్ రెడ్డి దర్శకత్వంలో మనోజ్ ఒక సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకు అత్తరు సాయిబు అనే పేరును ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. యాక్షన్, కామెడీ, మాస్ లుక్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఈ సినిమాను ప్రకటించబోతున్నారు. మరి ఈ సినిమాతో మనోజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.