Arjun S/O Vyjayanthi Censor: సెన్సార్ పూర్తి.. కళ్యాణ్ రామ్ హిట్ కొట్టినట్టే?

Arjun S/O Vyjayanthi Censor Report: బింబిసార సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత దానికి మించి హిట్ అందుకోవాలని చాలా ప్రయత్నాలు సాగించాడు. కానీ, బింబిసార తరువాత వచ్చిన సినిమాలు కళ్యాణ్ రామ్ కు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. ఇక హీరోగా కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్న ఈ హీరో.. తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు.
హీరోగా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నే నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకపాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే అర్జున్ సన్నాఫ్ వైజయంతీ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 18 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.
ఇక తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. 2 గంటల 24 నిమిషాల నిడివితో, యాక్షన్, ఎమోషన్ మరియు థ్రిల్స్ తో సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందని టాక్ వచ్చింది. యాక్షన్ సన్నివేశాల నుంచి తల్లీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాల వరకు డైరెక్టర్ ఎంతో అద్భుతంగా రక్తి కట్టించాడని సమాచారం.
ముఖ్యంగా సినిమాకు హైలైట్ అంటే విజయశాంతినే. ఆమె డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఒకపక్క.. కన్నకొడుకుపై ప్రేమను చూపించడం మరోపక్క.. ఇలా రెండు విధాలుగా ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతారని అంటున్నారు. కళ్యాణ్ రామ్ బాధ్యతాయుతమైన కొడుకు పాత్రను శక్తివంతమైనదిగా చిత్రీకరించడం మరియు అతని తల్లిగా విజయశాంతి కమాండింగ్, భావోద్వేగ సన్నివేశాలు అలరించనున్నాయట. క్లైమాక్స్ ఒక అద్భుతమైన మలుపును అందిస్తుంది. ప్రేక్షకులు చివరివరకు తమ సీట్ల అంచునఉండేలా చేస్తుంది.
ఇప్పటివరకు ఏ సినిమాలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదని నందమూరి కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్నారు. సెన్సార్ టాక్ ను బట్టి అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాకు పాజిటివ్ టాక్ నే అందుకుందని, మొదటి షోకు కూడా మంచి టాక్ వస్తే సినిమా హిట్ అయ్యినట్టే అని చెప్పొచ్చు. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి సినిమాను తీర్చిదిద్దిన విధానం కూడా అభిమానులను కట్టిపడేస్తుందని సమాచారం. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.