India : వాణిజ్య సంబంధాల బలోపేతానికే సుంకాల తగ్గింపు : భారత్

India : ఇండియా అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందన్న అంశాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడంతోనే తగ్గించడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. ఈ విషయంపై ఇండియా అధికారిక వర్గాలు మాత్రం వ్యాఖ్యలను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. సుంకాల తగ్గింపునకు చర్యలు నిజమే అయినప్పటికీ ట్రంప్ ఆరోపణలతో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించాయి.
గతంలో సుంకాలు తగ్గించిన భారత్..
గతంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల సందర్భంగా ఇండియా వరుసగా ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలపై సుంకాలు తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐరోపా సమాఖ్య, యూకేతో పలు ఒప్పందాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సుంకాలను తగ్గించాలని న్యూఢిల్లీ నిర్ణయం తీసుకుంది. అమెరికా ఇండియాపై విధించనున్న సుంకాల అమలుకు సమయం దగ్గరపడుతున్నందుకు కాదని భారత అధికారులు చెబుతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
సుంకాలు తొలగించాలి : అమెరికా
వ్యవసాయ ఉత్పత్తులు మినహా అన్ని వస్తువులపై సుంకాలను తొలగించాలని అగ్రరాజ్యం అమెరికా ఇండియాను కోరింది. న్యూఢిల్లీకి వాషింగ్టన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 118.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఇండియా ముందుకు వెళుతోంది. గత నెల ఫిబ్రవరి భారత్ ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. 2025 చివరి నాటికి ఇరుదేశాల మధ్య పరస్పరం బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) తొలిదశపై చర్చలు జరపడానికి ట్రంప్ అంగీకరించారు. ఇందులో భాగంగా మరిన్ని వస్తువులకు మార్కెట్‌ను తెరవడం, సుంకాల అడ్డంకులను తొలగించడానికి ఇరుదేశాల నేతలు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సుంకాలు విధిస్తామని ట్రంప్ వ్యాఖ్యలు..
ఇండియా, చైనా సహా పలు దేశాలపై సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీని టారిఫ్ కింగ్‌గా అభివర్ణించాడు. తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. వచ్చే నెల 2న ఇండియా, చైనా దేశాలపై విధించే సుంకాలు అమెరికా దశను మార్చనున్నాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బీటీఏ కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది.