Published On:

India-Pakistan : పాక్‌కు మరో షాక్‌.. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై భారత్‌ నిషేధం

India-Pakistan : పాక్‌కు మరో షాక్‌.. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై భారత్‌ నిషేధం

India-Pakistan : పాక్‌కు భారత్ మరో షాక్‌నిచ్చింది. ఆ దేశం నుంచి దిగుమతులపై నిషేధం విధించింది. తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా భారత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాక్ నుంచి ఇండియాకు రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాక్‌లో ఉత్పత్తి అయ్యే వస్తువులు, ఆ దేశం నుంచి ఇండియాకు వచ్చే అన్నిరకాల వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పాకిస్థాన్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. నిషేధం నుంచి మినహాయింపులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.

 

దిగుమతుల విలువ తక్కువే..
ఇండియా-పాక్ ఇరుదేశాల మధ్య వాణిజ్యానికి ఉన్న ఒకే రవాణా మార్గం అటారీ-వాఘా సరిహద్దు. ఇప్పటికే సరిహద్దును మూసివేశారు. 2019 సంవత్సరంలో పుల్వామా దాడి తర్వాత నుంచి దాయాది నుంచి చాలావరకు దిగుమతులు తగ్గించుకున్నాం. పాకిస్థాన్మ ఉత్పత్తులపై కేంద్రం 200 శాతం సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజల వంటివి మాత్రమే పాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా నుంచి పాకిస్థాన్‌కు 447.65 మిలియన్‌ డాలర్ల వస్తువులు ఎగుమతి అయ్యాయి. పాక్ నుంచి 0.42 మిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా జరుపుతున్న వాణిజ్యంలో 0.1శాతం మాత్రమే.

 

పాకిస్థాన్‌లో కొన్ని రంగాలపై ప్రభావం..
పాకిస్థాన్‌లోని కొన్ని పరిశ్రమలు ఇండియాకు చేసే ఎగుమతులపై ఆర్థికంగా ఆధారపడుతున్నాయి. ఆర్గానిక్‌ కెమికల్స్‌, ప్లాస్టిక్స్‌, లోహ సమ్మేళనాలు, మినరల్‌ ఫ్యుయల్స్‌, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంక, ఎంజైమ్స్‌, వర్ణ ద్రవ్యాలు, మసాలా దినుసులు వంటివి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా వాటిపై నిషేధం విధించడంతో పాకిస్థాన్‌లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది.

 

పాకిస్థాన్ ఓడలు రావొద్దు..
మరోవైపు, పాక్‌తో సముద్ర రవాణా మార్గాలను ఇండియా మూసివేసింది. పాక్ దేశ జెండాతో ఉన్న ఓడలు ఇండియా పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం, 1958లోని 411 సెక్షన్ ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇండియా ఓడలు కూడా పాకిస్థాన్ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాకిస్థాన్ విమానాలకు మన గగనతలాన్ని మూసివేసింది.

ఇవి కూడా చదవండి: