ORR : ఓఆర్‌ఆర్‌పై పెరిగిన టోల్ ఛార్జీలు

ORR : హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై టోల్ ఛార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను ఐఆర్‌బీ సంస్థ రెండేండ్ల కింద 30 ఏళ్ల కాలానికి లీజు తీసుకుంది. నిబంధనల మేరకు ప్రతి ఏటా 5 శాతం వరకు టోల్ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్ ధరలను పెంచింది.
దీన్ని ప్రకారం కారు, జీపు, వ్యాన్, లైట్ వాహనాలకు కిలోమీటరుకు 10 పైసలు పెంచింది. ప్రస్తుతం కిలోమీటరుకు రూ.2.34గా ఉన్న ఛార్జీలు రూ.2.44కు పెరిగాయి. మినీబస్సు, ఎల్‌సీవీలకు కిలోమీటరుకు 20 పైసలు వడ్డించింది. ప్రస్తుతం ఉన్న రూ.3.77 నుంచి రూ.3.94కు చేరింది. రెండు యాక్సిల్ బస్సులకు కిలోమీటరుకు రూ.6.69 నుంచి రూ.7కు పెంచింది. భారీ వాహనాలకు కిలోమీటరుకు రూ.15.09 నుంచి రూ.15.78కు పెంచింది.
ఏటా ఏప్రిల్ 1న టోల్ ఛార్జీలను సంస్థ పెంచుతూ వస్తున్నది. ఇందులో భాగంగా గతేడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఛార్జీలను పెంచింది.