Harish Rao : మహిళా శక్తి సభలో సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు : మాజీ మంత్రి హరీశ్

Harish Rao : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో శనివారం జరిగిన మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ విపక్షంలో ఉన్నప్పుడు మొదలు పెట్టి అధికారంలోకి వచ్చాక కూడా అబద్ధాలు మాట్లాడటం మానుకోలేదని విమర్శించారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పాలనలో మహిళా సంఘాలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని సీఎం రేవంత్ మహిళలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రూ.5 లక్షల వరకు మాత్రమే వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిగిలిన వాటికి 12 శాతం వడ్డీ వేస్తున్నారని ఆరోపించారు.
ఒక్క రూపాయి విడుదల చేయలేదు..
11 నెలల్లో ఒక్క రూపాయి మహిళా సంఘాలకు విడుదల చేయలేదని, తమ వద్ద లెక్కలన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. మరి అలాంటపుడు రేవంత్ ప్రకటించినవన్నీ అబద్ధాలే అని, అబద్దానికి అంగీ లాగు తొడిగితే రేవంత్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి సహవాసం వల్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా విలువలు వదిలేశారన్నారు. ఇప్పటికైనా వడ్డీ లేని రుణాలు విడుదల చేసి, తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. విద్యార్థులకు యూనిఫాం కుట్టినందుకు మహిళలకు ఒక్కో జతకు రూ. 75 ఇస్తున్నామని శనివారం జరిగిన సభలో తెలిపారని, నిజానికి ఒక్క మహిళకు కూడా కనీసం ఒక్క జత బట్టల కూలి ఇవ్వలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో వడ్డీలేని రుణాలు..
బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, డిప్యూటీ సీఎం భట్టి బ్యాంకుల్లో వివరాలు తెలుసుకోవాలన్నారు. ఎండలకు పంటలు ఎండుతున్నాయని రేవంత్ మాట్లాడటం ఆయన తెలివి తక్కువ తనమన్నారు. వర్షాలు బాగానే కురిసి అన్ని ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉన్నాయని, నీళ్లను ఏపీకి విడిచిపెట్టింది ఎవరని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌కి సోయి లేదని, నేడు ఒక్క వరంగల్‌లోనే లక్ష ఎకరాల పంట ఎండుతున్నాయని, దేవాదుల నీటిని ఎందుకు వినియోగించుకోలేదని నిలదీశారు. వెంటనే రైతులకు ఒక్కో ఎకరానికి రూ.10 వేలు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.