Telangana High Court: తెలంగాణ హైకోర్టు ఆశ్రయించిన వైఎస్ అవినాష్ రెడ్డి
తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
Telangana High Court: తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దివంగత మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తనను సిబీఐ అధికారులు విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు.
విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో తీవ్రవైన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) పేర్కొన్నారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీస్‌లు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేయొద్దని ఆయన కోరారు.
దర్యాప్తు అధికారి పక్షపాతంగా ఉన్నారు(Telangana High Court)
‘వివేకా హత్యకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటి వరకు సీబీఐ అరెస్టు చేయలేదు. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదు.
దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోంది.
నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది.
వివేకా హత్యకేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉంది. వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని .. అదే కోణంలో విచారణ చేస్తున్నారు.
తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు. నేను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారు’ అని అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో వెల్లడించారు.
మార్చి 12 న భాస్కర్ రెడ్డి విచారణ
కాగా, వివేకా హత్య కేసులో శుక్రవారం(మార్చి 10) ఉదయం 11 గంటలకు అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
ఈ క్రమంలో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరో వైపు మార్చి 12 న కడపలో అవినాష్ రెడ్డి తండ్రిని సీబీఐ విచారించనుంది.
ముందుగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రిని ఒకేసారి విచారణకు పిలిచింది సీబీఐ.
కానీ తనకు ముందస్తు కార్యక్రమాలు ఉండటం వల్ల సీబీఐ సూచించిన తేదీన విచారణకు రాలేనని ఎంపీ సీబీఐకి లేఖ ద్వారా తెలియ జేశారు.
చివరకు ఇద్దరి విచారణ తేదీలన మారుస్తూ సీబీఐ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మార్చి 10 న హైదరాబాద్ లో విచారణకు అవినాష్ రెడ్డి, 12 న కడపలో ఆయన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.