Srisailam temple: శ్రీశైల మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు.. భారీగా ఆదాయం

Hundi collection: నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలమల్లన్న ఆలయ హుండీ లెక్కింపును అధికారులు నిర్వహించారు. ప్రధానమైన శ్రీశైల మలన్న ఆలయం, భ్రమరాంబ అమ్మవారు, పరిసర ఆలయాల నుంచి హుండీలను తీసుకువచ్చి లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్ 1 నుంచి 28 వరకు రూ. 3 కోట్ల 61 లక్షల 42 వేల 16 నగదు సమకూరిందని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.
మరోవైపు నగదుతోపాటు 105 గ్రాముల బంగారం, 4.860 కిలోల వెండి వచ్చిందని తెలిపారు. వాటితో పాటు 644 యూఎస్ డాలర్లు, 50 సౌదీ అరేబియా రియాల్స్, ఒక కువైట్ దినార్, 115 యూఏఈ దిర్హమ్స్, 670 యూకే పౌండ్స్, 54 సింగపూర్ డాలర్లు, 25 కెనడా డాలర్లు, 40 సౌత్ ఆఫ్రికా రాండ్స్, ఐదు ఘనాయన్ సెడీ, 2000 సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్, వంద ఒమన్ బైసా వంటి వివిధ దేశాల కరెన్సీ లభించింది. హుండీ లెక్కింపు సందర్భంగా అధికారులు భారీ భద్రత, నిఘా ఏర్పాట్లు చేశారు. లెక్కింపు కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రమణమ్మ, పలువురు అధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మరోవైపు వేసవి సెలవులు, పరీక్షల ఫలితాలు వెల్లడి అవుతున్న నేపథ్యంలో శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్నను దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం దేవస్థాన అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి సందర్బంగా భక్తులకు మంచినీరు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇక పర్యాటకుల తాకిడితో శ్రీశైలం డ్యాం, పాతాళగంగ రోప్ వే వద్ద సందడి నెలకొంది. నల్లమల అడవుల అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.