Pawan kalyan : నేను ఎప్పుడూ హిందీ ఒక భాషగా వ్యతిరేకించలేదు.. పవన్ కల్యాణ్

Pawan kalyan : ఒక భాషను బలవంతంగా రుద్దడం.. వ్యతిరేకించడం సరికాదని జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో రెండు అంశాలు దోహదపడవని చెప్పారు. ఈ మేరకు పవన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని, దాన్ని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. ఎన్‌ఈపీ-2020 స్వయంగా హిందీని అమలు చేయలేదని పేర్కొన్నారు. హిందీ భాష అమలు విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. ఎన్‌ఈపీ-2020 ప్రకారం విద్యార్థులు విదేశీ భాషతోపాటు ఏవైనా రెండు భారతీయ భాషలు (మాతృ భాషతో పాటుగా) నేర్చుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. హిందీ భాష వద్దనుకుంటే వారి మాతృ భాషతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ ఇలా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని తెలిపారు.
విద్యార్థులకు ఎంపిక చేసుకునే సాధికారత కల్పించడం ద్వారా జాతీయ ఐక్యతను ప్రోత్సహించడం, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటం కోసం బహుభాషా విధానాన్ని రూపొందించారని తెలిపారు. దీన్ని రాజకీయ అజెండా కోసం తప్పుగా అర్థం చేసుకోకూడదని కోరారు. బహు భాషా విధానంపై పవన్ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడం పూర్తిగా అవగాహనా రాహిత్యమే అవుతుందన్నారు. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉండాలన్న విషయంలో జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.