Heavy Rain Alert in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి భారీ వర్షసూచన
Heavy rain forecast for AP Storm in the Bay of Bengal: ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహా సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరోసారి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నానికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 12వ తేదీలోపు తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరువవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ నెల 12 న భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావంతో ఈనెల 12వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దానిపై స్పష్టత వస్తుందని అంటున్నారు.
తెలంగాణలోనూ చిరుజల్లులు
ఇటు తెలంగాణలో దీని ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబదాద్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులలో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని, గంటకు 40 కి.మీ వేగంగా గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.