Big Shock To YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి గుడ్‌బై చెప్పనున్న మేకతోటి సుచరిత
Former Minister Mekathoti Sucharitha Big shock to YSRCP: వైసీపీకి మరో షాక్. ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, వైసీపీ సీనియర్ నేత మేకతోటి సుచరిత ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీని వీడి, జనసేనలోకి చేరగా, ఆ పొరుగు జిల్లాకు చెందిన నేత సుచరిత నేడో, రేపో ఆ పార్టీకి వీడ్కోలు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
విధేయ నేతగా గుర్తింపు..
కాంగ్రెస్ జడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసిన సుచరిత, వైఎస్ ప్రోత్సాహంతో 2009లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరగడంతో సుచరిత వైఎస్ జగన్ వెంట నడిచారు. ఇక 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచిన సుచరిత.. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి రావెల కిషోర్ బాబు చేతిలో ఓడినా, తిరిగి 2019లో ఆ సీటు నుంచే గెలిచి ఏకంగా హోంమంత్రి అయ్యారు. కానీ రెండున్నరేళ్ల తర్వాత ఆ పదవి నుంచి ఆమెను తప్పించి, ఆ సీటును వనితకు ఇవ్వటంతో ఆమె అలకబూనారు. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి, కొద్దిరోజుల తర్వాత తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. కానీ తన అసంతృప్తిని మాత్రమే వెళ్లగక్కుతూనే వచ్చారు
ప్రతిపాడు టు తాడికొండ
గత అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త మేకతోటి సుచరిత భర్త దయాసాగర్‌కు బాపట్ల ఎంపీ సీటును ఇస్తారని ఆమె ఆశించినా, అది జరగలేదు. పైగా, సుచరితను ప్రత్తిపాడు నుంచి తప్పించి.. తాడికొండ నుంచి పోటీ చేయించటం, అక్కడ ఆమె ఘోరంగా ఓడిపోవటం జరిగింది. నియోజక వర్గ మార్పుపై అప్పట్లోనే ఆమె విమర్శలు చేశారు. కాగా, తాజాగా ఆమెను సంప్రదించకుండానే తాడికొండ కొత్త ఇంచార్జ్‌గా డైమండ్ బాబును నియమించారు. దీనిపై ఆమె ఇక పార్టీలో కొనసాగలేననే నిర్ణయానికి వచ్చారు.
జనసేన వైపే చూపు..
తన రాజకీయ ప్రయాణాన్ని ప్రత్తిపాడులోనే కొనసాగించాలని భావిస్తున్న సుచరిత.. జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి జనసేనలో చేరిన కొందరు నేతలతో ఆమె భేటీ అయినట్లు తెలుస్తోంది. అలాగే, తన అనుచరులు, మద్దతుదారులతో ఆమె చర్చించగా, వారంతా టీడీపీ కంటే జనసేన పార్టీయే మేలని సూచించటంతో ఆమె నేడో రేపో వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.