Heavy Rain : హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్

Heavy Rain: హైదరాబాద్‌లో ఇవాళ పలు చోట్ల వర్షం కురిసింది. వాతావరణంలో మార్పుల వల్ల హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బోరబండ, మాదాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, జూబ్లిహిల్స్, సుల్తాన్ పూర్, మల్లంపేట్, గండి మైసమ్మ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపుతున్నారు. దీంతో నగరవాసులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఉక్కపోత, మరోవైపు చమటతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే సమయంలో నగరంలో వర్షం పడటంతో కాస్త ఉపశమం పొందుతున్నారు. రోడ్లపై వర్షం నీటితో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణలోని ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో వర్షం కురుస్తుంది. అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడగండ్ల వర్షాలు పడుతుండటంతో వరి, మామిడి, చెరుకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి.
పంట నష్టం ప్రభుత్వానికి నివేదిక..
ఈ నెల 21 నుంచి 23 వరకు వడగండ్ల వర్షాలతో పంట నష్టం సంభవించింది. పంట నష్టంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. దీనికి సంబంధించి తుది నివేదిక రూపొందించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశామని మంత్రి తెలిపారు. 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. 309 ఎకరాల్లో మామిడి, ఇతర పంటలకు నష్టం జరిగిందని తెలిపారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత పరిహారం చెల్లింపునకు చర్యలు చేపడుతామన్నారు.