Rain Alert: రాష్ట్రంలో దంచికొడుతున్న భారీ వర్షం.. ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరికలు!

Heavy rains in Telangana and Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది.
హైదరాబాద్‌లో అంబర్ పేట, తెల్లాపూర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, హఫీజ్ పేట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్, రామంతాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఎస్.ఆర్. నగర్, బోరబండ, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, కార్వాన్, వనస్థలిపురం ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం పడింది. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు రోడ్లపై నీరు భారీగా చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఇక, సిద్దిపేట, జగిత్యాల, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. అలాగే, ఏపీలోని కర్నూల్, మహానంది, ఆలూరు, నంద్యాల, శ్రీకాకుళం, అన్నమయ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. రాయలసీమ పలు ప్రాంతాల్లో వడగండ్లు పడడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఉదయం వేడి, సాయంత్రం భారీ వర్షం కురుస్తూ విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం పడుతున్నట్లు వాతావరణ కేంద్రం చెప్పింది. అయితే వర్షం తగ్గే వరకు జాగ్రత్తలు పాటించాలని, అందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచించింది. చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.