Israel: గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 70 మంది మృతి

Gaza: గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. వైమానిక దళాలతో భీకర దాడులు జరుపుతోంది. కాగా నిన్న రాత్రి కూడా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు 10 విమానాలతో దాడులు జరిపినట్టు సమాచారం. మరోవైపు ఉత్తర గాజా, దక్షిణ గాజాపై బుధవారం జరిపిన దాడుల్లో 22 మంది చిన్నారులు సహా మొత్తం 70 మంది వరకు చనిపోయారు. అలాగే వందలాది మంది గాయాలపాలయ్యారు. వీరిని నాజర్ ఆస్పత్రికి తరలించారు.
కాగా అమెరికా చొరవతో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో కొద్దిరోజులు ఆగిన దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అందులోనూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా పర్యటనలో ఉన్న టైంలోనే ఇజ్రాయెల్ దాడులు జరపడం గమనార్హం. దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. గాజాపై దాడులను ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సందిగ్ధత నెలకొంది.