Israel-Gaza : గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 38 మంది మృతి

Israel-Gaza : గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బుధవారం షెజైయాలో జరిపిన దాడిలో 38 మంది మృతిచెందినట్లు పాలస్తీనా ఆరోగ్యాధికారులు వెల్లడించారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. డజన్ల కొద్దీ గాయపడ్డారని, చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఒక సీనియర్ హమాస్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. పౌరులకు హానీ తలపెట్టకుండా ప్రయత్నాలు చేశారు కానీ, పౌరులకు మాత్రం నష్టం జరిగింది. ప్రత్యేక దాడుల్లో మరో 9 మంది మృతిచెందారని, బుధవారం నాటి మృతుల సంఖ్య 38కి చేరిందని స్పష్టం చేసింది.
సీనియర్ ఉగ్రవాదిని హతమార్చాం..
సీనియర్ ఉగ్రవాదిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. కానీ, అతని పేరు వెల్లడించలేదు. పౌరులకు హాని కలుగకుండా ముందుగా అనేక చర్యలు తీసుకున్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఎన్‌క్లేవ్‌లోని ఇతర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో మరో 9 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని స్థానిక ఆరోగ్య అధికారులు కూడా వెల్లడించారు. బుధవారం మృతుల సంఖ్య 38కి చేరినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే గత వారం షెజైయాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. అయినా ఖాళీ చేయలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మూడు వారాల్లో 1,500 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.