Rekhachithram Review: 40 ఏళ్లక్రితం జరిగిన హత్య..చేసిందెవరు.. సస్పెన్స్ తో చెమటలు పట్టిస్తున్న చిత్రం

Rekhachithram Review: సాధారణంగా ప్రేక్షకులు సినిమాల విషయంలో కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ, ఎప్పుడైనా కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంటే.. ఏదో హత్య జరిగింది.. దాన్ని ఛేదించే క్రమంలో క్లూలు వెతకడం మాత్రమే అనుకుంటే పొరపాటే. సీట్ ఎడ్జడ్ థ్రిల్లర్స్ అనేవి కొన్ని ఉంటాయి. సినిమా మొత్తం వరకు అసలు చంపిందెవరు.. ? ఎందుకు చంపారు అని తెలుసుకోవడం కోసం కళ్లు పక్కకు కూడా తిప్పకుండా చూస్తారు. అలాంటి ఒక థ్రిల్లరే రేఖాచిత్రం.
ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలపై అభిమానులు బాగా దృష్టిపెడుతున్నారు. మలయాళ మేకర్స్ కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. చిన్న బడ్జెట్ సినిమాలతో కోట్లు కొల్లగొడుతున్నారు. గతేడాది రిలీజ్ అయిన సూక్ష్మదర్శిని.. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను ఇన్స్పైర్ అయ్యే గురుమూర్తి.. తన భార్యను చంపినట్లు చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.
ఇక సూక్ష్మదర్శినిలానే రేఖాచిత్రం కూడా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆసిఫ్ ఆలీ, అనస్వర రాజన్, మనోజ్ కె జయన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం రేఖాచిత్రం. జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 5 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సీట్ ఎడ్జెడ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను మెప్పించింది. కేవలం రూ. 5- 6కోట్లతో నిర్మించిన రేఖాచిత్రం.. దాదాపు రూ. 50 కోట్లను వసూలు చేసి షాక్ ఇచ్చింది.
ఎప్పటినుంచో రేఖాచిత్రం సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీలివ్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరిలోనే రేఖాచిత్రం ఓటీటీలోకి రావాల్సి ఉండగా.. కొద్దిగా లేట్ అయ్యి నేడు అనగా మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
రేఖాచిత్రం కథలోకి వెళితే… వివేక్ గోపినాథ్(ఆసిఫ్ ఆలీ) ఒక పోలీసాఫీసర్. ఆన్ లైన్ లో రమ్మీ ఆడి.. సస్పెండ్ అవుతాడు. చిన్న తప్పే కావడంతో అతన్ని పై అధికారులు చిన్న ఊరు అయిన మలక్కపరకు ట్రాన్స్ ఫర్ చేస్తారు. మొదటి రోజు డ్యూటీలో చేరగానే వివేక్ కు రాజేంద్ర(సిద్దిఖీ) హత్య కేసు ఛేదించాల్సివస్తుంది. రాజేంద్ర ఫేస్ బుక్ లైవ్ లో తాను 40 ఏళ్ళ క్రితం ఒక అమ్మాయి శవాన్ని పాతిపెట్టి.. దాని నుంచి వచ్చిన డబ్బుతో ఎదిగానని, ఆ పాపం ఇంకా తనను వెంటాడుతోందని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాడు.
ఇక అంతేకాకుండా తనతో పాటు విన్సెంట్, ఫ్రాన్సిస్ అనేవారు కూడా ఉన్నారని చెప్తాడు. ఇక వివేక్ ఈ కేసును ఒక సవాలుగా తీసుకుంటాడు. అసలు 40 ఏళ్ళ క్రితం చనిపోయిన అమ్మాయి ఎవరు.. ? అని వెతుకుతున్న క్రమంలో ఆమె రేఖా(అనస్వర రాజన్) అనే జూనియర్ ఆర్టిస్ట్ అని తెలుస్తోంది. అసలు రేఖ ఎవరు.. ? ఆమెను ఎందుకు చంపాల్సివచ్చింది. వివేక్.. విన్సెంట్, ఫ్రాన్సిస్ ను పట్టుకున్నాడా.. ? లేదా.. ? అనేది మిగిలిన కథ.
సాధారణంగా ఏ మిస్టరీ థ్రిల్లర్ చూసినా రెండు ప్యాట్రన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి.. కొత్తగా జరిగిన వరుస హత్యలను లేదా.. అతి క్రూరంగా జరిగిన హత్యను ఛేదించడం.. రెండోది చాలా ఏళ్ళ క్రితం జరిగిన ఒక హత్య కేసును వెలికితీసి.. అప్పుడు జరిగిన హత్యను చేసిందెవరు.. ? అని కనిపెట్టడం. రేఖాచిత్రం రెండో కోవ కిందకు వస్తుంది. డబ్బు మీద ఆశ ఎంతకైనా తెగిస్తుంది అని ఈ సినిమాలో చూపించారు. చేసిన కర్మ ఎప్పటికీ వదలదు… అది ఎన్నేళ్లు అయినా వెతుక్కుంటూ నీ దగ్గరకే వస్తుందనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది..
సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టనివ్వదు. సినిమా మొదలైన 10 నిమిషాల్లోనే కథలోకి వెళ్ళిపోయాడు దర్శకుడు. చేసిన తప్పు నుంచి బయటకు వచ్చి.. ఒక మంచి పోలీస్ గా ఉండాలనుకునే వివేక్.. ఈ హత్య కేను ఛేదించడం మొదలుపెడతాడు. ఒక్కో క్లూ వెతుకుతూ.. వెతుకుతూ వెళ్తుంటే.. విలన్ ఆ క్లూస్ ను నాశనం చేస్తూ వస్తాడు. మధ్యలో కేసును వివేక్ నుంచి క్రైమ్ బ్రాంచ్ కు ఇస్తారు. అప్పటివరకు ఆ కేసును పర్సనల్ గా తీసుకున్న వివేక్.. సొంతంగా తానే ఇన్వెస్టిగేషన్ చేసి కిల్లర్ ను పట్టుకుంటాడు.
మొదటి నుంచి విన్సెంట్ విలన్ అని అందరికీ తెలుసు. కానీ, ఆమెను చంపడానికి మోటివ్ ఏంటి అనేది చాలా చాకచక్యంగా ట్విస్ట్ లతో చూపించి సక్సెస్ అయ్యాడు. విన్సెంట్ కన్నా పెద్ద విలన్ ఇంకొకరు అని తెలియడంతోనే ప్రేక్షకులు ఒకింత షాక్ కు గురవుతారు. ఎన్నో కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఒక యువతీ.. అసలు తానెందుకు చనిపోతుందో కూడా తెలియకుండా చనిపోవడం ప్రేక్షకుడును ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.
నటీనటుల విషయానికొస్తే అందరూ చాలా చక్కగా నటించారు. మలయాళ సినిమాలు ఎక్కువగా చూసేవారికి వీరందరూ సుపరిచితమే. మమ్ముట్టీని AI లో చూపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. వివేక్ గోపినాథ్ గా ఆసిఫ్ ఆలీ నటన అద్భుతం. ఇక రేఖగా అనస్వర రాజన్ చాలాన్యాచురల్ గా నటించింది. మిగతావారు తమ పరిధిమేర నటించారు. సినిమా మొత్తం చాలా ఎంగేజ్ చేస్తుంది. ఎలాంటి అసభ్యపదాలు, సీన్స్ లేకుండా చాలా బాగా తెరకెక్కించారు. మరి ఇంకెందుకు ఆలస్యం సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ వారం సోనీలివ్ లో రేఖాచిత్రంను చూసేయండి.