Tirumala Break Darshanam: శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్.. జూలై 15 వరకు కొత్త రూల్స్

TTD: తిరుమల శ్రీవారికి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం సమయాలను కూడా మార్చింది. ముఖ్యంగా వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం సమయాన్ని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మే1 నుంచి జూలై 15 వరకు కొత్త నిబంధనలను అమలు చేస్తోంది.
అయితే సమ్మర్ హాలిడేస్ కావడంతో సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో రోజురోజుకు క్యూలెన్లు నిండిపోయి.. వెలుపల వేచి ఉండాల్సి వస్తోంది. వీరికి శ్రీవారి దర్శనం వీలైనంత తొందరగా జరిగేలా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అలాగే క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆహారం, పాలు, మంచినీటిని సరఫరా చేస్తోంది. మరోవైపు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.
కానీ ప్రోటోకాల్ ఉన్న వీఐపీ భక్తులకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. అందులోనూ స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీ భక్తులకు మాత్రమే బ్రేక్ దర్శనం అమలు చేస్తోంది. అలాగే వారి సమయాల్లోనూ మార్పులు చేసింది. బ్రేక్ దర్శనాల సమయాన్ని కుదించింది.