Telangana DGP: తెలంగాణ డీజీపీగా జితేందర్ నియామకం
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Telangana DGP: తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతన డీజీపీగా నియమితులైన జితేందర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.గత ఏడాది డిసెంబర్ నెలలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన మొదటి డీజీపీ జితేందర్ కావడం విశేషం. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎన్నికల సంఘం నాటి డీజీపీ అంజనీకుమార్ ను సస్పెండ్ చేయడంతో రవి గుప్తాను తాత్కాలిక డీజీపీగా నియమించారు.
ఏడాదిపైగా పదవీకాలం..(Telangana DGP)
1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన జితేందర్ తొలుత నిర్మల్ ఏఎస్పీగా, అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేసారు. ఢిల్లీ, అస్సాంలో కొంతకాలం పనిచేసి తరువాత తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు.