Last Updated:

GST Revenue: ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది.

GST Revenue: ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు

GST Revenue: ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. కాగా, తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించి రూ. 1.87 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022, ఏప్రిల్ నెల వసూళ్లతో పోలిస్తే ఈ సారి 12 శాతం పెరిగాయి. మరో వైపు జీఎస్టీని అమలులోకి తెచ్చినప్పటి నుంచి వస్తు సేవల పన్ను వసూళ్లు ఈ స్థాయిలో వసూలు కావడం ఇదే మొదటి సారి.

 

ఏప్రిల్ నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ. 1,87,035 కోట్లు వసూలైనట్టు ఆర్థిక శాఖ తెలిపింది. అందులో సీజీఎస్టీ కింద రూ. 38, 440 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ. 47,412 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 89, 158 కోట్లు, సెస్సుల కింద రూ. 12,025 కోట్లు వసూలైనట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. అదే విధంగా 2022-2023 మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 18.10 లక్షల కోట్లు వసూలైనట్టు వెల్లడించింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 22 శాతం అధికమని తెలిపింది.

 

తెలుగు రాష్ట్రాల్లో వృద్ధి(GST Revenue)

మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు కూడా స్పల్పంగా పెరిగాయి. గత ఏడాది ఏపీలో ఏప్రిల్ రూ. 4067 కోట్ల వసూళ్లు సాధిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ లో రూ. 4329 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. గత ఏడాది పోలిస్తే వసూళ్లు 6 శాతం మేర పెరిగాయి. అదే విధంగా తెలంగాణ కూడా జీఎస్టీ వసూళ్లలో 13 శాతం వృద్ధిని నమోదే చేసింది. గత ఏడాది రూ. 4,955 కోట్లు సాధించగా.. ఈ ఏడాది ఏప్రిల్ లో రూ. 5,622 మేర జీఎస్టీ వసూళ్లు నమోదు చేసింది.