SBI SO Recruitment: స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎస్బీఐ నోటిఫికేషన్
దేశంలో దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI SO Recruitment: దేశంలో దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు శాఖల్లోని వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలను రెగ్యులర్ తో పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఎస్‌బీఐ దరఖాస్తులు కోరుతోంది. మే 19వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 217 పోస్టులకు గాను జూన్‌లో ఆన్‌లైన్ పరీక్ష జరిగే అవకాశం ఉందని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. పరీక్షకు 10 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో కాల్ లెటర్స్ అందుబాటులో ఉంచనున్నారు. బీటెక్ లేదా ఎంటెక్ విద్యార్హతతో భర్తీ చేసే ఈ ఉద్యోగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 182, ఒప్పంద ప్రాతిపదికన 35 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు, పరీక్షా విధానం(SBI SO Recruitment)
అభ్యర్థులు బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్సు/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఐటీ/సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. లేదంటే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంసీఏ లేదా ఎంటెక్ OR ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఈసీఈ) అయినా పూర్తి చేసి ఉండాలి.
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఖాళీలను బట్టి ముంబై, హైదరాబాద్ లలో పనిచేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ పోస్టులను ఎంఎంజీఎస్ III, ఎంఎంసీఎస్ II, జేఎంజీఎస్ 1 గ్రేడ్‌ల వారీగా విభజించి వయస్సు పరిమితి విధించారు.
కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపికయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా మూడేళ్ల పాటు విధిగా పనిచేయాల్సి ఉంటుంది. ఎంఎంసీఎస్ II, జేఎంజీఎస్ 1 గ్రేడ్ పోస్టులకు ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ లు జరుగుతాయి.
ఎంఎంజీఎస్ III పోస్టులకు మాత్రం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ముఖాముఖి ద్వారా సెలెక్ట్ చేస్తారు.
ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష కేంద్రాలను తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్‌లో ఏర్పాటు చేశారు. ఆయా పోస్టుల్లో నియమితులయ్యే ఉద్యోగులకు ఇచ్చే జీతం, పరీక్ష విధానం మొదలైన వివరాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.