కరణం ధర్మశ్రీ: గడపగడపకు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గుర్రంపై ప్రయాణం.. ఎందుకో తెలుసా?
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఓ ఎమ్మెల్యే ఏకంగా గుర్రం ఎక్కారు.
Karanam Dharmashree: ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఓ ఎమ్మెల్యే ఏకంగా గుర్రం ఎక్కారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన నియోజకవర్గంలోని ఏజెన్సీ ఏరియాలలో రోడ్డు మార్గం లేకపోవడంతో నాలుగు కిలోమీటర్ల మేర గుర్రంపై తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రోలుగుంట మండలం శివారు ఏజెన్సీ ఆర్ల పంచాయతీకి చెందిన లోసంగి పీతురు గడ్డ, పెద్ద గరువు, గుర్రాల బైల, గడప పాలెం గ్రామాలలో గడపగడపకు కార్యక్రమంలో గుర్రంపై పాల్గొన్నారు. అక్కడ ప్రజలు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే వారికి త్వరలో కొండపై కూడా రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
గడపగడపకు కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంపై నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం జగన్ ప్రజల్లో తిరగని ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లను కూడ సమావేశాల్లో చదవి వినిపిస్తున్నారు. ఈ కార్యక్రమంపై అశ్రద్ద చూపిన వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వనంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దీనితో వైసీపీ ఎమ్మెల్యేలు గ్రామాల బాట పడుతున్నారు.