Janasena: రాళ్ల దాడి కేసు.. జనసేన నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రుల కార్లపై రాళ్ల దాడి కేసులో జనసేన నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు.
Visakhapatnam: విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రుల కార్ల పై రాళ్ల దాడి కేసులో జనసేన నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. నోవోటల్ బస చేసిన సుందరపు విజయ్‌కుమార్, పీవీఎస్ఎస్ రాజు, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విశ్వక్షేణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ పంచకర్ల సందీప్, పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గేదెల చైతన్య, వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, కోన తాతారావు, శివప్రసాద్ రెడ్డి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా మంత్రుల పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశామన్న పోలీసులు అర్ధరాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా ఆయన సహచరులు, పార్టీ నేతలు బస చేసిన హోటల్ వద్దకు వెళ్లి సోదాలు నిర్వహించారు. అలానే జనసేన నేతలను కూడా అదుపులోనికి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్లోర్ లోకి పోలీసులు చేరుకోవడంతో ఉద్రికత్త నెలకొంది. నోవోటల్ పవన్ బస చేసిన ఫ్లోర్లో పెద్ద ఎత్తున పోలీసుల తనిఖీలు నిర్వహించారు. పవన్ బస చేసిన రూమ్ చుట్టూ భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు. నోవోటల్ హోటల్ చుట్టూ భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడం పై జనసైనికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన ఘటన పై జనసేన అధినేత పవన్ విచారం వ్యక్తం చేశారు. జనసేన ఎల్లప్పుడూ పోలీసులను గౌరవిస్తుందని, జనసేన నాయకులను అరెస్ట్ చేయడం అనవసరం అని పవన్ వ్యాఖ్యానించారు. ఘటన పై డీజీపీ జోక్యం చేసుకుని జనసేన నాయకులను విడుదల చేయాలన్నారు. లేదంటే స్వయంగా తానే స్టేషన్‌కు వచ్చి జనసైనికులకు సంఘీభావం తెలుపుతానని పవన్ తెలిపారు.