Published On:

USA: భారతీయులకు నిరాశ.. ఈ ఏడాది 1100 మంది బహిష్కరణ

USA: భారతీయులకు నిరాశ.. ఈ ఏడాది 1100 మంది బహిష్కరణ

Students: అమెరికాలో చదువుకోవాలని, మంచి ఉద్యోగం సాధించాలని ఎన్నో కలలతో అగ్రదేశంలో అడుగుపెట్టిన భారతీయులకు నిరాశ ఎదురైంది. ఈఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1100 మంది భారతీయులను అమెరికా నుంచి తిరిగి పంపడం, దేశ బహిష్కరణ చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చెపట్టిన తర్వాత జనవరి నుంచి ఇప్పటివరకు 1080 మంది భారతీయులను బహిష్కరించారని చెప్పారు.

 

వీరిలో 62 శాతం వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారన్నారు. అక్రమ వలసలకు సంబంధించి రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతోందని, అందుకే అక్రమ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించిన వారిని మన దేశం వెనక్కి తీసుకువస్తుందని ఆయన తెలిపారు. ఇరాన్ లో ముగ్గురు భారతీయులు అదృశ్యమైన విషయంలో ఆ దేశ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. కాగా కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా విదేశీ విద్యార్థులపై కూడా అక్కసు వెల్లగక్కుతోంది. ఈ నేపథ్యంలోనే హార్వర్డ్ యూనివర్శిటీలో విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వద్దని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే విద్యార్థులకు అమెరికా వీసాల ఇంటర్వ్యూ ప్రక్రియను కూడా నిలిపివేశారు.