Published On:

PM Modi: జులై 2 నుంచి పలు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

PM Modi: జులై 2 నుంచి పలు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

PM Foregin Tour: బ్రెజిల్ వేదికగా జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకుగాను ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సౌత్ లోని కీలక దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. జులై 2 నుంచి 9 వరకు 5 దేశాల్లో టూర్ ఉండనుంది. ఎనిమిది రోజుల పర్యటనలో ప్రధాని మోదీ బ్రెజిల్, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. జులై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై ఇరుదేశాలు చర్చలు జరపనున్నాయి.

అనంతరం జులై 3,4 తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో లో ప్రధాని పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంలూ, ప్రధాని కమ్లా పెర్సాద్- బిస్సేసర్ తో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. ఆ దేశానికి చెందిన పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించే అవకాశం ఉంది. జులై 4,5 తేదీల్లో అర్జెంటీనా దేశానికి వెళ్లనున్నారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి వంటి కీలక రంగాల్లో భారత్- అర్జెంటీనా మధ్య సంబంధాలు ఉన్నాయి. వీటిని మరింతగా బలోపేతం చేసుకునేందుకుగాను అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరుపుతారని సమాచారం.

అనంతరం బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రెజిల్ కు వెళ్లనున్నారు. జులై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రియో డి జనీర్ లో జరగనున్న బ్రిక్స్ సమావేశాల్లో వాణిజ్యం, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం వంటి అంశాలపై సభ్యదేశాలతో సంబంధాలు బలోపేతం చేసే దిశగా దేశాధినేతలు చర్చించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ చివరగా నమీబియా దేశానికి వెళ్తారు. దేశ అధ్యక్షుడు నంది- నదిత్వాతో పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం నమీబియా పార్లమెంట్ లో ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చదవండి: