Donald Trump: భారత్- పాక్ యుద్ధాన్ని నేను ఆపానన్న ట్రంప్

Donald Trump On Operation Sindoor: భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇప్పటికే పలుమార్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తాజాగా అదే పాత పాటను పాడారు. నెదర్లాండ్స్ లోని హేగ్ లో నాటో శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలన్నీ తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకున్నారు. కాగా ఇరాన్- ఇజ్రాయెల్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ట్రంప్.. తాను జోక్యం చేసుకోవడంతోనే భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గిపోయాయని తెలిపారు.
ఇరు దేశాలకు చెందిన నేతలు తాను వరుస ఫోన్ కాల్స్ చేయడంతోనే యుద్ధం ముగించారని పేర్కొన్నారు. మీరు ఒకరితో ఒకరు పోరాడితే మేం ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోమని వారికి చెప్పామన్నారు. భారత ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడన్నారు. పాక్ జనరల్ అసిఫ్ మునీర్ ఆకట్టుకునే వ్యక్తి.. వారు కూడా వాణిజ్య ఒప్పందమే కావాలని చెప్పుకొచ్చారు. అలా తామే ఆ యుద్ధాన్ని ఆపామని ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ కామెంట్స్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ట్రంప్ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మే 10 నుంచి ఇలా చెప్పడం ఇది 16వ సారి అని రమేశ్ అన్నారు. అలాగే హస్తం పార్టీ నేత పవన్ ఖేరా కూడా ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి ప్రధాని భారత్ ప్రయోజనాలను తుంగలో తొక్కారని కామెంట్స్ చేశారు. భారత్- పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని మోదీ ఇటీవల చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ట్రంప్ కి కాల్ చేసి చెప్పారు. అయినా ట్రంప్ ఇలా మాట్లాడటం గమనార్హం.